Sunday, December 26, 2010

తెలుగువారి సందేహాల సమాహారమైన .... '' తెలుగ్వైతం ''

తాంబూలం

ఇంత కాలానికి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ఆధ్యాత్మికతా దర్శనం అయింది. తెలుగు మతం ఊపిరి పోసుకుంది. దాని పేరు తెలుగ్వైతం. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అన్నీ ఈ తెలుగ్వైతం ముందు దిగదుడుపే.

మామూలుగా ఏం జరుగుతుందంటే, ఒక్కో సమూహానికి ఒక్కో మతం ఉంటుంది; కానీ తెలుగువారిలో ఒక్కొక్కరికీ ఒక్కో మతం ఉంటుంది. ఆ మతం ఇతర మతాలకంటే ఎందుకు గొప్పదంటే దాని జీవితం క్షణక్షణానికీ మారుతూంటుంది. మతం అనేది అశాశ్వతమనీ, అందువల్ల దాన్ని శాశ్వతంగా మారుస్తూండాలనీ తెలుగ్వైతం చెబుతుంది. శంకరాచార్యులవారిని చదివేస్తే అద్వైతం, రామానుజాచార్యులను చదివేస్తే విశిష్టాద్వైతం అర్థమయిపోతాయంటారు. హన్నన్నా. అంత సులభంగా ఒహణ్ణి చదివేస్తే అర్థమైపోయేవి కూడా మతాలేనా? ఎవడికి వాడు నిగ్గు తేల్చుకునేదే అసలు సిసలు మతం. ప్రతి ఒక్కడినీ సృష్టికర్తను చేసేదే అసలు సిసలు మతం. అదే తెలుగ్వైతం.
ద్వైతానికి ఇద్దరు కనిపిస్తారు.
అద్వైతానికి ఇద్దరూ కలిసి ఒక్కరుగానే కనిపిస్తారు.
విశిష్టాద్వైతానికి ఒకరికి దాసోహమనే మరొకడు కనిపిస్తాడు.
తెలుగ్వైతానికి ఎవరూ, ఏదీ ఉన్నట్టే కనిపించరు.

కావాలంటే రోశయ్యగారిని అడగండి 'అసలీ రాష్ట్రంలో ప్రతిపక్షమనేది ఉందా? మీడియా అనేది ఉందా? మర్యాదస్తులెవరైనా ఉన్నారా? అసలీ రాష్ట్రంలో ఉన్నవారు అన్నం తింటున్న మనుషులేనా' అన్నీ సందేహాలే.
జయప్రకాశ్ నారాయణ్ గారినీ, నారాయణగారినీ, రాఘవులుగారినీ అడగండి - అసలీ రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా? ఉన్నా దాని పేరు ప్రభుత్వమేనా? ఆ ప్రభుత్వానికి చీమూ, నెత్తురూ ఉన్నాయా?' అన్నీ సందేహాలే.
చిరంజీవిగారిని అడగండి 'కాంగ్రెస్ అధిష్టానం నన్నెందుకు ప్రేమిస్తోంది? ఈ ప్రేమను స్వీకరిస్తే నా బతుకు ట్రాజెడీనా, కామెడీనా? ఇద్దరు హీరోయిన్లతో చేసీ చేసీ చివరికి ప్రజారాజ్యం, కాంగ్రెస్‌ల ప్రేమలో కూడ నేను ఎంచుకోవాల్సి వస్తుందా? దీనికి పరుచూరి గారి స్క్రిప్ట్ లేదే?' అన్నీ సందేహాలే.

చంద్రబాబుగారిని అడగండి 'కాంగ్రెసూ రైతుల్ని నాశనం చేస్తే, కాంగ్రెసూ ఫ్లయ్ ఓవర్లూ, మెట్రోలూ వేస్తే, కాంగ్రెస్సూ సూక్ష ్మరుణాల ఆత్మహత్మలు చేస్తే, మరి నేనెందుకున్నట్టు? నాకసలు ఉనికి ఉందా లేదా?' అన్నీ సందేహాలే. లగడపాటి రాజగోపాల్‌గారిని అడగండి 'కేసీఆర్‌ది నోరేనా? అది తెరిస్తే వచ్చేది మాటలేనా?' - అప్పుడు కేసీఆర్ గారికి కూడా మరో సందేహం - 'లగడపాటి ఎం.పీనా? లేక పి.సి. సర్కార్ శిష్యుడా? ఎం.పీయే అయితే, కొంతకాలం తోటి ఎం.పీని కదా - నాకు మాయమయ్యే ట్రిక్కు ఎందుకు నేర్పలేదు? విజయవాడలో మాయమై, హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యే ట్రిక్కే నేర్పి వుంటే, ఉద్యమం చేసేవాణ్ణి కాదేమో? ఇద్దరం కలిసి, ప్రజలమీద కనికట్టు విద్య చేస్తూ ఉంటే, జీవితం గడిచిపోయేది కాదూ?' జగన్‌గారిని అడగండి - 'అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఉందా? ఉంటే అందులో నేనున్నానా? ఉన్నాను పో. అయితే ముఖ్యమంత్రిని ఎందుకు కాలేదు? లేను పో.
మరి అది కాంగ్రెస్ ఎలా అవుతుంది? నేనెవరో తెలీనపుడు నేను ఎవర్ని ఓదార్చాలి? నన్ను నేను ఓదార్చుకోవడానికి యాత్ర అవసరమా? ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? కాని ఇంట్లో కూర్చుంటే మీడియా కెమెరాలు రావు కదా. ఇప్పుడు నేను ఎవర్ని నమ్మాలి? చివరికి సురేఖమ్మ కూడ నాకు అనుకూలమో, వ్యతిరేకమో తెలిసి చావట్లేదు కదా. నాన్న పోగానే వాళ్లంతా సంతకాలు పెట్టిన కాగితాలు ఏమయ్యాయి? అసలవి సంతకాలేనా?'
ఆయనకు తెలీడం లేదు గానీ నిజానికి ఆయనే తెలుగ్వైతం మత వ్యవస్థాపకుడు.

ఇక మీడియా వారి సందేహం - 'మేమిప్పుడు ఎవరివైపు?' (మీడియా ఎవరివైపూ ఉండనవసరం లేదన్న తత్వానికి తెలుగ్వైతంలో చోటు లేదు). అసలు ఎవరు ఎవరి వైపో మేమే కదా నిర్ణయించాల్సిన వాళ్లం! మాకే అర్థం కాకపోతే ప్రజలకేం చెబుతాం? బయటకు వెళ్తే, ఎవడో ఆపి 'తెలంగాణ వస్తోందా?' అని అడుగుతాడు. మాకేం తెలుసు? మరొకడు 'తెలంగాణ రాకపోతే జనవరిలో ఏమవుతుంది?' అని అడుగుతాడు. మాకేం తెలుసు? కాని తెలీకపోతే మేం మీడియా ఎలా అవుతాం? వివిధ సభా నిర్వాహకులకూ అనేక సందేహాలున్నాయి. ఆహ్వాన పత్రికల్లో 'ముఖ్యమంత్రిగారిచే ప్రారంభం' అంటే సరిపోతుందా? పేరు వేసే సాహసం చేయొచ్చా? అలాగే పేర్లు లేకుండా సాంస్కృతిక శాఖమంత్రి, ఉన్నత విద్యామంత్రి ... ఇలా వేసుకుంటూ పోవడం క్షేమం కదా?'

ఇక ప్రజలు - 'అసలు వైఎస్సార్ చనిపోయాడా?' అనే ఆధ్యాత్మిక ప్రశ్న నుంచి 'కిరణ్‌కుమార్‌రెడ్డి గారు తొందరపడి క్యాంప్ ఆఫీసులోకి మారిపోయారా? మేం హైద్రాబాద్‌లో ఇల్లు కొనాలా? అమ్మాలా' వంటి వాస్తవ జగత్తుకు సంబంధించిన ప్రశ్నల వరకూ అనేకం అడుగుతున్నారు.
ప్రశ్నించడం హేతువాద దృక్పథానికి సంకేతం. సందేహం అపరిమితమైన ఐక్యూకి సంకేతం. తెలుగువారి సందేహాల సమాహారమైన తెలుగ్వైతానికి కొత్త సంవత్సరంలో 'ప్రపంచ మతములు' అనే విజ్ఞాన సర్వస్వంలో చోటు లభిస్తుందని ఆశిద్దాం.

- మృణాళిని
98490 65147