Monday, October 25, 2010

రక్త చరిత్ర ...



మనం పుట్టించకపోతే పదాలెలా పుడతాయి...ఆర్ జీ వీ సినిమా తీయకపోతే మనమేం మాట్లాడుకుంటాము. మామూలు మనుష్యులకొచ్చే ఆలోచనలు ఆయనకి రావనుకుంటా. దేవుడంటే నమ్మకం లేదు(ట). దెయ్యాలుంటాయో లేదో తెలీదు(ట). ఇలా చాలా ఉన్నాయి. శివ సినిమాతో ఇండస్ట్రీలోకొచ్చి ...కాల క్రమేణా కొన్ని సినిమాలు తీసి..కొండపై స్వామి వారి కిరీటం కొట్టేసే లెవల్లో అద్భుతమైన సినిమాలు తీసి..అందులో దేవుడున్నాడు అని చెప్పాడో లేదని చెప్పాడో అర్ధం కాలేదు.సడెన్ గా చక్రం అదీ వస్తుంది..మరి.. ఎవరి మీదో అలిగి..తెలుగు సినిమాకు దూరమైనాడు..

తరువాత ఫాక్టరీ ఒకటి పెట్టాడు.. కానీ అందులోంచి పొల్యూషను..వ్యర్ధ పదార్ధాలే ఎక్కువ వచ్చి అసలు ఉపయోగపడే ప్రోడక్ట్లు తక్కువ వచ్చినాయి. అని ఆయనదే ఉవాచ. నాకిష్టమొచ్చినట్టు తీస్తా చూస్తే చూడండి ...లేక పోతే లేదు.. అని ధైర్యంగా చెప్పగల దమ్మున్న ప్రొడ్యూసర్..డైరెక్టర్...ఆయన తీసిన దెయ్యం సినిమాలు...ఒక్కళ్ళే చూడగలిగితే ప్రైజ్ ఇస్తానన్నట్టుగానే ఆయన తీసిన ఆగ్ లాంటి సినిమాలు ఆయనొక్కడే లేదా ధియేటర్ మొత్తం మీద ఒక్క ప్రేక్షకుడే చూసిన సందర్భాలూ ఉన్నాయి.

Friday, October 22, 2010

రామ్ గోపాల్ వర్మ ... రక్తచరిత్ర ...

 

 
రక్త చరిత్రలో ఎన్టీఆర్ విలనా?
రామ్ గోపాల వర్మ రక్తచరిత్ర సినిమా విషయంలో కొత్త కోణం ముందుకు వచ్చింది. ఇది కొత్త వివాదం కూడా. రాజకీయాల్లోనే కాకుండా సినిమాల్లో కూడా తిరుగులేని వ్యక్తిగా ఎదిగిన ఎన్టీఆర్ పై వర్మ సినిమాలో బురద చల్లారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాపై తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఎన్టీఆర్ పాత్రను వ్యతిరేకంగా చిత్రించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ప్రముఖ హిందీ నటుడు శతృఘ్న సిన్హా పోషించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ప్రజా దేశం పార్టీగా మార్చారు. ఎన్టీ రామారావు తన పార్టీలోకి పరిటాల రవిని ఆహ్వానిస్తారు. ఈ సంఘటన ఉంది. ఎన్టీ రామారావును పూర్తిగా నెగెటివ్ క్యారెక్టర్ గా చిత్రించారు. ఓబుల్ రెడ్డిని హత్య చేయడానికి పరిటాల రవిని ఎన్టీఆర్ ను ఆహ్వానించినట్లుగా ఉంది.

రౌడీలను చంపడానికి రౌడీయే కావాలని ఎన్టీఆర్ అన్నట్లుగా సినిమాలో ఓ దృశ్యం ఉంది. ఓబుల్ రెడ్డి హత్య కూడా ఎన్టీఆర్ కనుసన్నల్లోనే జరిగిందనే అర్థం వచ్చే దృశ్యం సినిమాలో ఉంది. ఎన్టీఆర్ వద్ద పరిటాల రవి అనుచరులు గోల గోల చేసినట్లు కూడా ఉంది. ఎన్టీ రామారావును ఇప్పటి వరకు రాజకీయాల్లో గానీ సినిమాల్లో గానీ వ్యతిరేకంగా చూపిన సంఘటనలు, సందర్భాలు లేవు. ఓ మహాపురుషుడిగానే ఎన్టీ రామరావును చూస్తూ వస్తున్నారు. అయితే, ఒక్కసారిగా ఎన్టీ రామారావును రామ్ గోపాల్ వర్మ విలన్ గా చూపించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ పాత్రను చిత్రీకరించిన తీరుపై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను కోర్టుకెక్కుతానని ఆమె చెబుతున్నారు. పరిటాల రవి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ముందు చాలా కష్టాలు పడ్డారని ఆమె చెప్పారు. పార్టీలోకి రావడానికి ముందు పరిటాల రవి చాలా ఇబ్బందులు పడ్డారని ఆమె అన్నారు. తానే పరిటాల రవిని పిలిపించానని, అన్నీ మాట్లాడిన తర్వాతనే పార్టీలో చేర్చుకున్నామని ఆమె చెప్పారు. పాత్ర చిత్రీకరణలో వర్మ కనీస మర్యాద కూడా పాటించలేదని ఆమె అంటున్నారు. వర్మను ఆమె చండాలుడిగా అభివర్ణించారు. వర్మకు ధైర్యం ఉంటే తనతో మాట్లాడాలని ఆమె సవాల్ చేశారు. రామ్ గోపాల వర్మ నీచుడని ఆమె అన్నారు. తాను సినిమా చూడబోనని చెప్పారు. మొత్తం మీద, ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణపై తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ మర్డర్ చేయించడానే పద్ధతిలో వర్మ చిత్రించారు.

రక్త చరిత్ర భాష్యం: ఎన్టీఆర్  విలన్, వైయస్సార్ హీరో?

 రక్త చరిత్ర సినిమాలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును రామ్ గోపాల్ వర్మ ప్రతినాయకుడిగా చూపించడం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వర్మపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్టీఆర్ కు ప్రజల్లో ఎనలేని అభిమానం ఉంది. ఎన్టీఆర్ ఇమేజ్ కు తిరుగులేదు. పేదల పాలిటి పెన్నిధిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. రెండు రూపాయలకు కిలోబియ్యం వంటి పథకాలు చేపట్టి పేద ప్రజల మన్ననలు పొందారు. ఆయనను అపర కృష్ణుడిగా పూజించే వారున్నారు. ఆయన పోషించిన పౌరాణిక పాత్రలు అనన్య సామాన్యమైవనే పేరుంది. ఈ స్థితిలో రామ్ గోపాల్ వర్మ ఓ మిత్ ను ఛేదించినట్లు రక్త చరిత్ర సినిమాలో ఎన్టీఆర్ పాత్రను నెగెటివ్ గా చూపించారు. అది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తుందని చెప్పలేం. కానీ కాంగ్రెసుకు ఏదో మేరకు లాభం చేకూరుస్తుందని మాత్రం నమ్ముతున్నారు. అది కూడా, వైయస్ రాజశేఖర రెడ్డి ని ఆయన కుమారుడితో పాటు కాంగ్రెసులోని చాలా మంది నాయకులు మహా నేతగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రక్తచరిత్ర సినిమా వచ్చింది.

నిజానికి, చాలా కాలంగా ఎన్టీఆర్ కీర్తిప్రతిష్టలకు వైయస్సార్ ను అడ్డు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారం చేస్తూ ఎన్టీఆర్ కు ఉన్న ఆదరణను తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. వైయస్సార్ వంటి నేత లేరంటూ ఆయన కుమారుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఊరూరూ తిరిగి చెబుతున్నారు. ఎన్టీఆర్ తర్వాత రాష్ట్రంలో ప్రజల ఆదరణను చూరగొన్న నాయకుడు వైయస్సార్ మాత్రమేనని చెప్పాలి. అయితే, వైయస్సార్ కు ఫాక్షనిజం మచ్చ ఉంది. రక్తచరిత్రలో ఓ ప్రధాన పాత్ర అయిన మద్దెలచెర్వు సూరికి వైయస్సార్ ఆండదండలు పుష్కలంగా ఉండేవని అంటారు. తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య కూడా వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. వైయస్సార్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం నాయకులను ఫాక్షనిజానికి పేరు మోసిన రాజశేఖర రెడ్డి చంపిస్తున్నాడంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడ పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు కూడా. రామ్ గోపాల వర్మ రక్త చరిత్ర -2లో వైయస్సార్ పాత్ర ఉందా అనేది ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న. వైయస్సార్ పాత్ర ఉంటే అది ఉదాత్తంగా ఉంటుందా, ఫాక్షనిజం మచ్చ ఉన్న వ్యక్తిత్వంగా ఉంటుందా అనేది కూడా చర్చనీయాంశమే. వైయస్సార్ ను మహానేతగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఎన్టీఆర్ ను రక్త చరిత్రలో విలన్ గా చూపించారా అనేది సందేహించాల్సిన విషయం. ఆదరణ విషయంలో, ఇమేజ్ విషయంలో దివంగత నేత వైయస్సార్ కు ఎన్టీ రామారావే పోటీ. ఇది కమ్మ, రెడ్ల ఆధిపత్య వ్యవహారాలకు సంబంధించిందా అనేది కూడా చర్చనీయాంశమే.

వర్మ చేసిన తప్పేమిటి?

రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర అనూహ్య రీతిలో కొత్త వివాదం చెలరేగింది. సినిమా విడుదలకు ముందు వివాదం రేగడానికి అవకాశం ఉన్న సంఘటనలపై తీవ్ర దుమారం రేగుతూ వచ్చింది. అయితే, సినిమా విడుదలయ్యాక అనూహ్యమైన వివాదం ముందుకు వచ్చింది. సినిమా విడుదలయ్యే వరకు తెలుగుదేశం పార్టీ కోణం ముందుకు రాలేదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పాత్రపై ఏ విధమైన అనుమానాలు కలగలేదు. ఓబుల్ రెడ్డిని నెగిటివ్ గా, విలన్ గా చూపించారనే ప్రచారంపై తీవ్ర దుమారం చెలరేగింది. మద్దెలచెర్వు సూరి, పరిటాల రవిలను హీరోగా చిత్రీకరించారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ, తీరా సినిమా విడుదలయ్యే సరికి ఎన్టీఆర్ పాత్రపై దృష్టి మళ్లింది. ఎన్టీఆర్ ను విలన్ గా, కమెడియన్ గా చూపించడంతో వర్మపై తీవ్ర వ్యాఖ్యలు మొదలయ్యాయి. అనంతపురం జిల్లాలోని తెలుగుదేశం కార్యకర్తలు వర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ ను వెధవగా, బ్రోకర్ గా అభివర్ణిస్తున్నారు. అనంతపురం జిల్లా పరువు తీసే విధంగా సినిమా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. పరిటాల రవి చేసిన హత్యల వెనక ఎన్టీఆర్ పాత్ర ఉందనే విధంగా సినిమాలో వర్మ చిత్రించడాన్ని వారు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఎన్టీ రామారావును కించపరచారని అంటున్నారు. వర్మ సినిమాపై ఆందోళనకు సిద్ధపడుతామని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. పరిటాల రవిని కూడా నెగిటివ్ గా చూపించారని మండిపడుతున్నారు. వర్మ తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే విధంగా సినిమా తీశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాగా, మీడియాపై కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్, వల్లభనేని వంశీ వంటి తెలుగుదేశం నాయకులు వర్మకు మీడియా విశేషంగా ప్రచారం కల్పించడాన్ని తప్పు పట్టారు. వర్మను మేధావిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వర్మ సైకో అని వంశీ అన్నారు. మీడియా ఇంటర్వ్యూల్లో కాలు మీద కాలేసుకుని నిర్లక్ష్యంగా వర్మ వ్యవహరించారని, రక్తచరిత్రకు అనవసరమైన ప్రచారం కల్పించారని దుమ్మెత్తి పోస్తున్నారు. ముంబైలో తీవ్రంగా అప్పుల పాలై రక్తచరిత్రతో తెలుగు సినిమా రంగంలోకి మళ్లీ వచ్చారని అంటున్నారు.

ప్రస్తుత స్థితిలో వర్మ రక్తచరిత్ర సినిమాకు రాజకీయ కష్టాలు మొదలయ్యే ప్రమాదం ఉంది. నిజానికి, తన తండ్రి ప్రధాన పాత్రగా పరిటాల రవి శ్రీరాములయ్య చిత్రం తీశారు. ఆ సినిమా విశేషంగా నడిచింది. ఆ పాత్రనే రక్తచరిత్ర మొదటి భాగంలో వస్తోంది. అది వాస్తవిక కల్పిత గాధగా మనకు కనిపిస్తుంది. కానీ, రక్తచరిత్రలో సృజనాత్మక కల్పన మరుగునపడిపోయి వక్రీకరణ జరిగిందనేది ప్రధాన అభిప్రాయంగా కనిపిస్తోంది. గాయం సినిమా కూడా విజయవాడ రాజకీయాలను ప్రధానం చేసుకుని నడుస్తుంది. అందులోనూ కల్పన ఉంది. సినిమా చివరికి వచ్చే సరికి ఆ సినిమాలో కూడా వక్రీకరణ జరిగింది. వక్రీకరణకు కల్పనకు మధ్య తేడాను గుర్తించకపోవడంతో వర్మ చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది.

రక్త చరిత్రతో రాయలసీమలో మళ్లీ ఫాక్షనిజం పెరుగుతుందా?

రామ్ గోపాల వర్మ రక్త చరిత్ర విడుదల నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, అనంతపురం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తీవ్ర వివాదాల మధ్యనే ఆ సినిమా విడుదలవుతోంది. హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి, ప్రత్యర్థి మద్దెలచెర్వు సూరి మధ్య నడిచిన ఫాక్షనిజాన్ని ఇతివృత్తంగా తీసుకుని రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రతీకారాలు, హత్యలు, దాడులు, ప్రతిదాడులు వంటి హింసాత్మక సంఘటనలతో సినిమా నిండి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. వర్మ సినిమాల్లో హింస, సెక్స్ ప్రధాన విషయాలుగా ఉంటాయి కాబట్టి అనంతపురం జిల్లా ఫాక్షనిజం నచ్చిందని, అందుకే రక్త చరిత్ర సినిమా మొత్తం హింస నిండి ఉంటుందని అనుకుంటున్నారు. ట్రయలర్స్ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. మద్దెలచెర్వు సూరి, పరిటాల రవి - ఇద్దరినీ సినిమాలో హీరోగా చూపిస్తారని, తమ సోదరుడిని విలన్ గా చూపిస్తున్నారని ఓబుల్ రెడ్డి సోదరి ఉమాదేవి చాలా కాలంగా మండిపడుతున్నారు. ఆమె విమర్శలను రామ్ గోపాల వర్మ తిప్పికొడుతున్నారు. ఎవరైనా సినిమా చూసిన తర్వాతనే మాట్లాడాలని ఆయన అంటున్నారు.

రక్త చరిత్ర పాతగాయాలను తట్టి లేపుతుందని, దాని వల్ల అనంతపురం జిల్లాలో ఫాక్షనిజం మళ్లీ పెరుగుతుందని కొంత మంది వాదిస్తున్నారు. బిజెపి నాయకులు ఆ మాటే అంటున్నారు. మాజీ నక్సలైట్ కిష్టప్ప భార్య భూలక్ష్మి కూడా అదే మాట అంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. రేపు శుక్రవారం సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రక్త చరిత్ర సినిమా పోస్టర్లు థియేటర్ల వద్ద తప్ప ఎక్కడా కనిపించడం లేదు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సినిమాను సినిమాగా చూడాలని జిల్లా ఎస్పీ ఎం కె సింగ్ ప్రజలకు విజ్ఝప్తి చేస్తున్నారు. ఎంకె సింగ్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మద్దెలచెర్వు సూరి, పరిటాల రవి వంటి వారిని మోడల్ గా మాత్రమే తీసుకున్నానని, ఇతివృత్తం మాత్రం కల్పితమని, వాస్తవం కాదని రామ్ గోపాల్ వర్మ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా ప్రివ్యూకు ఆయన మద్దెలచెర్వు సూర్యనారాయణ కుటుంబాన్ని, తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత కుటుంబాన్ని ఆహ్వానించినట్లు సమాచారం. మద్దెలచెర్వు సూరితో కలిసి రామ్ గోపాల్ వర్మ అనంతపురంలో సినిమా చూడడానికి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అనంతపురంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మద్దెలచెర్వు సూరితో కలిసి బెంగళూర్ లో సినిమా చూడడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రక్త చరిత్ర సినిమాపై మీడియా తీవ్రమైన ఉత్కంఠను, ఉద్విగ్నతను పెంచుతోంది. ఎప్పటికప్పుడు వివాదాలను వెలికి తీస్తూ పెద్ద యెత్తున టీవీ చానెళ్లు వార్తాకథనాలను ప్రసారం చేస్తున్నాయి. ప్రత్యేక చర్చా కార్యక్రమాలను పెడుతున్నాయి. రామ్ గోపాల వర్మతో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశాయి. ఆయనతో చర్చాగోష్టులు నిర్వహించాయి.

రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర ఎవరి కోసం తీశారు?

ప్రముఖ దర్శకుడు రక్త చరిత్ర సినిమాను ఎవరి కోసం తీశారనే ప్రశ్న విడుదల సందర్భంలో ప్రధానంగా ముందుకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మద్దెలచెర్వు సూరికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యం ఈ ప్రశ్న రావడానికి ప్రధాన కారణం. మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరికి అనుకూలంగానే వర్మ రక్తచరిత్ర తీసినట్లు ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించాలని సూరి అనుకుంటున్నారని, అందుకు అనుగుణంగానే సూరిని సినిమాలో హీరోగా చూపించే ప్రయత్నం చేశారని అంటున్నారు. సినిమాకు పెట్టుబడి కూడా సూరి పెట్టినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పరిటాల రవిని విలన్ గా చూపిస్తే ఆయన శిబిరం మండిపడుతుందనే భయం కూడా వర్మకు ఉందని అంటున్నారు. దీంతో సినిమాలో సూరిని, రవిని రెండు వైపులా పెట్టి ఆ ఇద్దరిని హీరోలుగా చూపించినట్లు చెబుతున్నారు.

కాగా, ఓబుల్ రెడ్డిని విలన్ గా చిత్రీకరించినట్లు చెబుతున్నారు. సూరి, రవి, ఓబుల్ రెడ్డిలకు చెందిన మూడు కుటుంబాల కథలో ఓబుల్ రెడ్డిని రేపిస్టుగా, గొంతులు కోసే కిరాతకుడిగా, నానా అవలక్షణాలున్న ప్రతినాయకుడిగా చూపించినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఓబుల్ రెడ్డి సోదరి ఉమాదేవి మండిపడుతున్నారు. తన సోదరుడు రేప్ కేసులో నిందితుడు కాడని, సూరి తమ్ముడే రేప్ కేసులో ఉన్నాడని ఉమాదేవి ఓ టీవీ న్యూస్ చానెల్ ప్రతినిధితో అన్నారు. ఓబుల్ రెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని వర్మ అంటున్నారు. అయితే, దీనిపై కూడా ఉమాదేవి మండిపడుతున్నారు.

 

Thursday, October 14, 2010

మీ ప్రపంచంలో మీరుండండి. నా ప్రపంచంలో నేనుంటాను.

కంటితో చూస్తాం, చెవులతో వింటాం, చర్మంతో స్పర్శానుభూతి పొందుతాం. ఈ జ్ఞానేంద్రియాలు చేసేవన్నీ మెదడు నిర్వర్తించే కార్యకలాపాలే. మెదడు అంటే ఆలోచన, భావన తప్ప ఇంకేమీ కాదు. నేను కళ్లు మూసుకుని రాత్రి నిద్రపోగానే, నా మొత్తం ప్రపంచం నాకు సంబంధించినంత వరకూ అంతమైపోతుంది. తిరిగి ఉదయం నిద్రలేవగానే, మళ్లీ ఆవిష్కృతమవుతుంది.
ఆ ప్రపంచం ఈ భూగ్రహం మీద నిద్రపోయి లేచిన ప్రతి మనిషికీ, ప్రతి జంతువుకీ, ప్రతి క్రిమికీటకానికీ ఒక్కో విధంగా ఆవిష్కృతమవుతుంది. అది ఆ ఒక్కరికి మాత్రమే ప్రత్యేకమైన ప్రపంచం. దాన్ని చూడటం గానీ, అందులోకి వెళ్లి అనుభూతించడం గానీ వేరెవరికీ సాధ్యం కాదు, తమదైన ఆ ప్రపంచంలో ఉన్నవాళ్లతో ఇతరులకి ఎంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ. వాళ్ల వాళ్ల వ్యక్తిగత అనుభవాలు, వాళ్ల వాళ్ల ఉద్వేగాలు, వాళ్ల వాళ్ల జ్ఞానం, వాళ్ల వాళ్ల తెలివితేటల స్థాయిల మీద ఆధారపడి, వాళ్ల వాళ్ల ప్రపంచాలు వాళ్ల వాళ్లకి అనుగుణంగా నిర్మితమై ఉంటాయి.

అలాగే, నా ప్రపంచం కూడా నాకు మాత్రమే సంబంధించిన నా ఉద్వేగాలు, నా ఆలోచనలు, నా భావనల సమాహారం. కాబట్టి, నా ప్రపంచంలోకి వచ్చిన ఇంకెవరైనా, నేను ఎలా అనుకున్నానో నాలాగే వాళ్లూ అనుకోవాలనుకోవడం, నన్ను అభినందించాలనుకోవడం, నన్ను అర్థం చేసుకోగలరనుకోవటం నా భ్రమే అవుతుంది. ఎందుకంటే వాళ్ల ప్రపంచాన్ని నేను అనుభవించలేనట్టే నా ప్రపంచాన్ని వాళ్లు అనుభవించలేరు.

‘నా సినిమాలు నాకోసం చేసుకుంటాను’ అని నేను తరచూ అనే మాటకు నిజమైన అర్థం ఇది. ఎవరూ మనం చెప్పాలనుకున్నదాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరని నాకు పూర్తిగా అర్థమైనప్పుడు, వాళ్లకు అర్థం అయ్యేటట్టు ప్రయత్నించడంలో అర్థం ఏముంది? అందుకే, నా ప్రపంచంలోకి రావడానికి ఆసక్తి ఉన్నవాళ్లకు నా సినిమాల ద్వారా బహిరంగ ఆహ్వానం పలుకుతాను. ఇక వాళ్లు వచ్చిన తరువాత దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా వ్యాఖ్యానించుకుంటారు, ఎలా ఇష్టపడతారు, ఎలా ద్వేషిస్తారు అనేది వాళ్లకే వదిలేస్తాను.

నా సినిమా కూడా నా ప్రపంచం తప్ప మరోటి కాదు. ఆ ప్రపంచాన్ని నిర్మించడానికి చాలామంది పనిచేస్తుండవచ్చు. కాని వాళ్లందరూ రంగులద్దేది నా ఊహకే.

ఒక సినిమాకు సంబంధించి దర్శకుడు ప్రాథమిక కళాకారుడు కాదు. ఒక నటుడు నటిస్తాడు, ఒక సంగీత దర్శకుడు సంగీతాన్ని సృష్టిస్తాడు, ఓ రచయిత సంభాషణలు రాస్తాడు... ఇలాంటి ఎన్నో ప్రాథమిక కళల కలయికతో ఒక భావోద్వేగాన్ని సృష్టించడానికి వీలుగా వీటన్నింటినీ దర్శకుడిగా నేను ఏకీకృతం చేస్తాను. నేను ఏ సంగీతం వినాలని అభిలషిస్తున్నానో, అదే సంగీతం ప్రేక్షకుడికి వినబడుతుంది. ఏ రకమైన నటన చూడా లని భావిస్తున్నానో అదే నటన తెరమీద కనబడుతుంది.

కాబట్టి, నేను ప్రేక్షకుడికి ఏది ఎలా అందాలనుకుంటున్నానో, అదే ఆయా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందజేస్తారు. ఈ అవగాహన నాకు స్పష్టంగా ఉంది కాబట్టే, ఒక సినిమా హిట్ అయితే దాని ఫలితం అందరిదీ అని, ఫ్లాప్ అయితే దానికి బాధ్యుణ్ని నేనే అని భావిస్తాను. ఎందుకంటే, నేను చేస్తున్న ఆ సినిమాకు ఏవి కావాలో వాటిని అందించడానికి నా దృక్పథంలో వాటిని చూసి వాళ్ల వాళ్ల శక్తిసామర్థ్యాల మేరకు పూర్తిస్థాయిలో వాళ్లు పనిచేస్తారు.

ఎవరి వల్ల సినిమాలోని నా ఏ ఊహ మెరుగుపడిందో కేవలం నాకు మాత్రమే తెలుస్తుంది. అందుకే, ఓ సందర్శకుడు నా ప్రపంచంలోకి అడుగిడి, తను ఆశించింది దొరక్క ఆశాభంగం చెంది, అసంతృప్తిగా బయటికి వెళ్తున్నాడంటే అది కచ్చితంగా కేవలం నా ఒక్కడి ఫెయిల్యూరే. కాని, ఆ సందర్శకుడికి ఏదైతే నచ్చిందో అది నాది కాక మరొకరి కంట్రిబ్యూషన్ వల్ల కావచ్చు.

మీ ప్రపంచం ఏంటో మీకు స్పష్టంగా తెలిసుంటే, మీరు దాన్ని అర్థం చేసుకొనుంటే, దాన్ని ఎలా నిర్మించాలనుకుంటున్నారో మీకంటూ ఒక స్పష్టత ఉంటే, మీ జీవితం మీకు మాత్రమే సంబంధించిన మీ కాల్పనిక ప్రపంచం అవుతుంది.

ఆ నా సొంతమైన నా కాల్పనిక ప్రపంచంలో నాకు ఉండేవి... సర్కార్ లాంటి శక్తివంతమైన వ్యక్తులు, గాఢమైన సంగీతం, శ్రీదేవి లాంటి అందంతో కూడిన శృంగారభరిత స్ర్తీలు, వోడ్కా లాంటి డ్రింకులు, గ్యాంగ్‌స్టర్లు, దయ్యాలు, నేను ఎలా కావాలనుకుంటే అలా వక్రీకరించుకోగలిగే వేరు వేరు ఫిలాసఫీలు మాత్రమే. ఇక సామాజిక బాధ్యతలు, కుటుంబ విలువలు, అత్యున్నత ఆదర్శాలు, దేవుళ్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు లాంటి చాలామంది జీవితాలకి సంబంధించిన వాస్తవాల మాట ఎత్తితే నేను నా కళ్లు మూసుకుని నిద్రకు ఉపక్రమిస్తాను... గుర్‌ర్‌ర్‌ర్‌ర్...

పి.ఎస్.: మీ ప్రపంచంలో మీరుండండి. నా ప్రపంచంలో నేనుంటాను.

నేనింతవరకూ ఈ కాలమ్‌లో నా సినిమాల గురించి, నా ఆలోచనల గురించి, నా దృక్పథాల గురించి నా నోటికొచ్చిన వాగుడు వాగాను. మీక్కూడా ఏమైనా వాగాలనిపిస్తే (నన్ను ఏమైనా ప్రశ్నలు అడగాలనిపిస్తే) సాక్షి ‘నా’ కాలమ్‌కి పంపండి. నాకు తోచిన సమాధానమిస్తాను.

మీ రాంగోపాల్‌వర్మ
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
‘నా...’, ఫన్‌డే, సాక్షి దినపత్రిక
రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034
మెయిల్: naa.funday@gmail.com