| |
కంటితో చూస్తాం, చెవులతో వింటాం, చర్మంతో స్పర్శానుభూతి పొందుతాం. ఈ జ్ఞానేంద్రియాలు చేసేవన్నీ మెదడు నిర్వర్తించే కార్యకలాపాలే. మెదడు అంటే ఆలోచన, భావన తప్ప ఇంకేమీ కాదు. నేను కళ్లు మూసుకుని రాత్రి నిద్రపోగానే, నా మొత్తం ప్రపంచం నాకు సంబంధించినంత వరకూ అంతమైపోతుంది. తిరిగి ఉదయం నిద్రలేవగానే, మళ్లీ ఆవిష్కృతమవుతుంది. ఆ ప్రపంచం ఈ భూగ్రహం మీద నిద్రపోయి లేచిన ప్రతి మనిషికీ, ప్రతి జంతువుకీ, ప్రతి క్రిమికీటకానికీ ఒక్కో విధంగా ఆవిష్కృతమవుతుంది. అది ఆ ఒక్కరికి మాత్రమే ప్రత్యేకమైన ప్రపంచం. దాన్ని చూడటం గానీ, అందులోకి వెళ్లి అనుభూతించడం గానీ వేరెవరికీ సాధ్యం కాదు, తమదైన ఆ ప్రపంచంలో ఉన్నవాళ్లతో ఇతరులకి ఎంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ. వాళ్ల వాళ్ల వ్యక్తిగత అనుభవాలు, వాళ్ల వాళ్ల ఉద్వేగాలు, వాళ్ల వాళ్ల జ్ఞానం, వాళ్ల వాళ్ల తెలివితేటల స్థాయిల మీద ఆధారపడి, వాళ్ల వాళ్ల ప్రపంచాలు వాళ్ల వాళ్లకి అనుగుణంగా నిర్మితమై ఉంటాయి. అలాగే, నా ప్రపంచం కూడా నాకు మాత్రమే సంబంధించిన నా ఉద్వేగాలు, నా ఆలోచనలు, నా భావనల సమాహారం. కాబట్టి, నా ప్రపంచంలోకి వచ్చిన ఇంకెవరైనా, నేను ఎలా అనుకున్నానో నాలాగే వాళ్లూ అనుకోవాలనుకోవడం, నన్ను అభినందించాలనుకోవడం, నన్ను అర్థం చేసుకోగలరనుకోవటం నా భ్రమే అవుతుంది. ఎందుకంటే వాళ్ల ప్రపంచాన్ని నేను అనుభవించలేనట్టే నా ప్రపంచాన్ని వాళ్లు అనుభవించలేరు. ‘నా సినిమాలు నాకోసం చేసుకుంటాను’ అని నేను తరచూ అనే మాటకు నిజమైన అర్థం ఇది. ఎవరూ మనం చెప్పాలనుకున్నదాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరని నాకు పూర్తిగా అర్థమైనప్పుడు, వాళ్లకు అర్థం అయ్యేటట్టు ప్రయత్నించడంలో అర్థం ఏముంది? అందుకే, నా ప్రపంచంలోకి రావడానికి ఆసక్తి ఉన్నవాళ్లకు నా సినిమాల ద్వారా బహిరంగ ఆహ్వానం పలుకుతాను. ఇక వాళ్లు వచ్చిన తరువాత దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా వ్యాఖ్యానించుకుంటారు, ఎలా ఇష్టపడతారు, ఎలా ద్వేషిస్తారు అనేది వాళ్లకే వదిలేస్తాను. నా సినిమా కూడా నా ప్రపంచం తప్ప మరోటి కాదు. ఆ ప్రపంచాన్ని నిర్మించడానికి చాలామంది పనిచేస్తుండవచ్చు. కాని వాళ్లందరూ రంగులద్దేది నా ఊహకే. ఒక సినిమాకు సంబంధించి దర్శకుడు ప్రాథమిక కళాకారుడు కాదు. ఒక నటుడు నటిస్తాడు, ఒక సంగీత దర్శకుడు సంగీతాన్ని సృష్టిస్తాడు, ఓ రచయిత సంభాషణలు రాస్తాడు... ఇలాంటి ఎన్నో ప్రాథమిక కళల కలయికతో ఒక భావోద్వేగాన్ని సృష్టించడానికి వీలుగా వీటన్నింటినీ దర్శకుడిగా నేను ఏకీకృతం చేస్తాను. నేను ఏ సంగీతం వినాలని అభిలషిస్తున్నానో, అదే సంగీతం ప్రేక్షకుడికి వినబడుతుంది. ఏ రకమైన నటన చూడా లని భావిస్తున్నానో అదే నటన తెరమీద కనబడుతుంది. కాబట్టి, నేను ప్రేక్షకుడికి ఏది ఎలా అందాలనుకుంటున్నానో, అదే ఆయా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందజేస్తారు. ఈ అవగాహన నాకు స్పష్టంగా ఉంది కాబట్టే, ఒక సినిమా హిట్ అయితే దాని ఫలితం అందరిదీ అని, ఫ్లాప్ అయితే దానికి బాధ్యుణ్ని నేనే అని భావిస్తాను. ఎందుకంటే, నేను చేస్తున్న ఆ సినిమాకు ఏవి కావాలో వాటిని అందించడానికి నా దృక్పథంలో వాటిని చూసి వాళ్ల వాళ్ల శక్తిసామర్థ్యాల మేరకు పూర్తిస్థాయిలో వాళ్లు పనిచేస్తారు. ఎవరి వల్ల సినిమాలోని నా ఏ ఊహ మెరుగుపడిందో కేవలం నాకు మాత్రమే తెలుస్తుంది. అందుకే, ఓ సందర్శకుడు నా ప్రపంచంలోకి అడుగిడి, తను ఆశించింది దొరక్క ఆశాభంగం చెంది, అసంతృప్తిగా బయటికి వెళ్తున్నాడంటే అది కచ్చితంగా కేవలం నా ఒక్కడి ఫెయిల్యూరే. కాని, ఆ సందర్శకుడికి ఏదైతే నచ్చిందో అది నాది కాక మరొకరి కంట్రిబ్యూషన్ వల్ల కావచ్చు. మీ ప్రపంచం ఏంటో మీకు స్పష్టంగా తెలిసుంటే, మీరు దాన్ని అర్థం చేసుకొనుంటే, దాన్ని ఎలా నిర్మించాలనుకుంటున్నారో మీకంటూ ఒక స్పష్టత ఉంటే, మీ జీవితం మీకు మాత్రమే సంబంధించిన మీ కాల్పనిక ప్రపంచం అవుతుంది. ఆ నా సొంతమైన నా కాల్పనిక ప్రపంచంలో నాకు ఉండేవి... సర్కార్ లాంటి శక్తివంతమైన వ్యక్తులు, గాఢమైన సంగీతం, శ్రీదేవి లాంటి అందంతో కూడిన శృంగారభరిత స్ర్తీలు, వోడ్కా లాంటి డ్రింకులు, గ్యాంగ్స్టర్లు, దయ్యాలు, నేను ఎలా కావాలనుకుంటే అలా వక్రీకరించుకోగలిగే వేరు వేరు ఫిలాసఫీలు మాత్రమే. ఇక సామాజిక బాధ్యతలు, కుటుంబ విలువలు, అత్యున్నత ఆదర్శాలు, దేవుళ్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు లాంటి చాలామంది జీవితాలకి సంబంధించిన వాస్తవాల మాట ఎత్తితే నేను నా కళ్లు మూసుకుని నిద్రకు ఉపక్రమిస్తాను... గుర్ర్ర్ర్ర్... పి.ఎస్.: మీ ప్రపంచంలో మీరుండండి. నా ప్రపంచంలో నేనుంటాను. నేనింతవరకూ ఈ కాలమ్‌లో నా సినిమాల గురించి, నా ఆలోచనల గురించి, నా దృక్పథాల గురించి నా నోటికొచ్చిన వాగుడు వాగాను. మీక్కూడా ఏమైనా వాగాలనిపిస్తే (నన్ను ఏమైనా ప్రశ్నలు అడగాలనిపిస్తే) సాక్షి ‘నా’ కాలమ్‌కి పంపండి. నాకు తోచిన సమాధానమిస్తాను. మీ రాంగోపాల్‌వర్మ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా: ‘నా...’, ఫన్డే, సాక్షి దినపత్రిక రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034 మెయిల్: naa.funday@gmail.com | |
| |
| |
Thursday, October 14, 2010
మీ ప్రపంచంలో మీరుండండి. నా ప్రపంచంలో నేనుంటాను.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
hi sir.. malli meeru Raktha charithra-3 thistara
Your thoughts are very special.
You are special.
Your movies are special.
Your answers in NAA page are special.
I want to be your special friend.
But one advise. mee prapanchamlo meeru undakunda 10% ina maaa prapanchamloki chudandi. kastaalu, kanneellu kaakunda aanandam kooda chaala undi.
Post a Comment