Wednesday, May 16, 2012

అనఘనగా ఓ విజేత

నలభై ఐదేళ్ల వయసులో ఒక మహిళ ఒంటరిగా జీవితాన్ని ఆరంభించి గెలవడం అనుకున్నంత సులభం కాదు. అయితే అసాధ్యమూ కాదని చావళి సర్వమంగళ అంటున్నారు. కట్టుబట్టలతో కన్నవారింట్లో అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు కొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. ఐఎస్‌బి బిజినెస్‌మేనేజ్‌మెంట్ కోర్సుకు ఎంపికై, ఫ్యాప్సీ ఉత్తమ ఔత్సాహిక మహిళ అవార్డును కూడా అందుకున్నారు. సర్వమంగళ జీవితంలోని చీకటి వెలుగులు ఆమె మాటల్లోనే...http://www.indiaprline.com/wp-content/uploads/2012/05/Ms.-Sarvamangala-Chavali-of-Anagha-seen-showcasing-range-from-the-Handloom-Designer-and-Fashion-Blouses-Collection-launched-by-Anagha.jpg?9d7bd4
ఒక భార్య ఓడిపోయేదెప్పుడు? ఇది చిన్న ప్రశ్నలా కనిపించవచ్చు కానీ నేను నిలువనీడ కోల్పోయినప్పుడు పడ్డ వేదన మాటల్లో చెప్పలేనిది. ఒక కూతురిగా నేను గెలిచాను. నా కాళ్లపై నేను నిలదొక్కుకున్నాను. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక, కాపురం కోసం అన్నీ వదులుకుని నేను నాకు కూడా మిగలకుండా అయిపోయినా సరే భార్యగా ఓడిపోయాను. 

45 ఏళ్ల వయసులో ఒంటరినైపోయాను. అలాంటి సమయంలో మా నాన్నే నన్ను ఆదుకోకపోయుంటే నా బతుకు ఏమయ్యేదో!. నాన్న నుంచి ఆర్థికసహాయం అందుకుని భార్యనై కోల్పోయిన జీవితాన్ని ఒక స్త్రీగా పొందడానికి పోరాడాను.
నేల నుంచి నింగిపైకి... మాది మధ్యతరగతి కుంటుంబమైనా, ఆర్థిక సమస్యలేమీలేవు. పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపూర్ మా సొంతూరు. నాన్న పైలట్ కావడంతో నా బాల్యమంతా ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, అస్సాంలలో గడిచింది. 

అస్సాంలో హోం సైన్స్ చదవుతుండగానే నాకు ఎంతో ఇష్టమైన ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం కోసం కలలు కంటూ, దానికోసం నిరంతర ప్రయత్నాలు చేస్తుండేదాన్ని. మొత్తానికి 1986 సంవత్సరంలో నా కల సాకారమయ్యింది. సెలబ్రిటీలను దగ్గరి నుంచి చూడటం, కొత్త ప్రదేశాలు తిరగడం, మంచి జీతం తీసుకోవడం...ఏదో లోకంలో గడుపుతున్నట్టుగా కాలం గడిచింది.

జవానుకో సలామ్... ఎయిర్‌హోస్టెస్‌గా తక్కువ కాలమే చేసినా అవన్నీ మరచిపోలేని జ్ఞాపకాలగానే ఉండిపోయాయి. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, రేఖ, సునీల్ గవాస్కర్, దేశ దేశాల క్రికెట్ ఆటగాళ్ల పలకరింపులు...ఇవన్నీ ఎంతో థ్రిల్ కలిగించేవి. అందరికంటే సునీల్ గవాస్కర్ మా పట్ల సహృదయత చూపేవారు. శ్రీలంకకు శాంతి సైన్యాలు వెళ్లిన చాపర్‌లలో నేనూ పనిచేశాను. జవాన్లు ఎక్కడ ఉన్నారో వారికే తెలియదు.                 
వారంతా తమ ఇంటి చిరునామాలిచ్చి, భార్య పేరున ఉత్తరం రాయమనే వారిలా... " నేను బావున్నా. అమ్మా, నాన్నల ఆరోగ్యం జాగ్రత్త. బాబుకి ముద్దులు'' ఇంతే సమాచారం. ఇంటి వాళ్లు తిరిగి జవాబు రాయడం కోసం నా చిరునామా ఇవ్వాలని బ్రతిమాలేవారు. ఈ పని నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చినా ఎన్నో ఉత్తరాలకు ఒకే విషయం రాసేటపుడు ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగేవి కావు. తరువాత కొద్దికాలానికే వివాహం జరగడంతో ఆ జీవితాన్ని విడిచిపెట్టేయాల్సొచ్చింది.

నింగి నుంచి పాతాళంలోకి... ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగంలో చేరినపుడు నాలుగేళ్ల వరకు వివాహానికి దూరంగా ఉంటామని అంగీకార పత్రం సమర్పిస్తాము. ఒక వేళ దీన్ని ఉల్లంఘిస్తే ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందే. ఎయిర్‌హోస్టెస్‌గా మూడేళ్లు గడిచాయో లేదో మంచి సంబంధం వచ్చిందని ఇంటోవాళ్లు వివాహానికి ఒప్పించారు.అలా అస్సాంలోని ఉద్యోగ జీవితం వదిలి వివాహ జీవితంలో అడుగుపెట్టేందుకు హైదరాబాద్ వచ్చేశాను. ఏ లోటు లేకుండా పెళ్లి జరిగినా కొద్ది రోజులకే వేధింపులు మొదలయ్యాయి.
http://cdn-o360.batoi.com/wp-content/uploads/2012/05/Untitled-111-300x163.png
దాంతో ఆయనే ఏదైనా వ్యాపకం పెట్టుకోమనడంతో చేనేత బట్టల వ్యాపారాన్ని ఎంచుకున్నాను. మంగళగిరి, నారాయణపేట, చీర్యాల, భట్టిప్రోలుతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంచి చేనేత వస్త్రాలు తీసుకువచ్చి వ్యాపారం చేశాను. ఆ పని చేసినన్ని రోజులూ ఏనాడూ నా కోసం రూపాయి కూడా తీసుకోలేదు. అదంతా కుటుంబ సేవగానే భావించాను. కానీ బయట ఎలా ఉన్నా ఇంటికెళ్లాక ఎప్పటిలాగే పరిస్థితి దారుణంగా ఉండేది.

ఒంటరి ప్రయాణంలో... వ్యవహారం చివరకు కొట్టడం వరకు వెళ్లింది. అప్పటికే ఇద్దరు పిల్లలున్నారు నాకు. చూస్తుండగానే 26 ఏళ్ల వివాహం జీవితం గడిచింది. అయినప్పటికీ దెబ్బలు తినటాన్ని భరించలేకపోయాను. అక్కడి నుంచి బయటపడిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ ఇంట్లో నా కంటూ ఏమీ మిగలలేదు. నా తరపున ఎవరూ మాట్లాడలేదు. కట్టుబట్టలతో నాన్న దగ్గరకు వెళ్లిపోయాను. నా పట్ల ఆయన అన్నిరకాల బాధ్యతలు నిర్వర్తించి ఉన్నారు. దాంతో వెళ్లాలా? వద్దా? అని సతమతమై గత్యంతరం లేనిపరిస్థితిలో ఆయన దగ్గరకే వెళ్లాను. మూడు నెలలు భారంగా గడిచాయి.

అప్పటికే చేనేత వస్త్రాలతో పరిచయం ఉండటంతో నాన్న దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకుని 2007లో 'అనఘ' చేనేత వస్త్రాల దుకాణం మొదలు పెట్టాను. పూర్వ పరిచయాల వల్ల లక్షల రూపాయల మెటీరియల్‌ను అప్పుగా ఇవ్వడానికి చేనేత కార్మికులు అంగీకరించారు. 


ఇంటికి వెళితే వేదన చుట్టిముడుతుందని అనఘలోనే సమయమంతా గడిపేదాన్ని. రెండు సంవత్సరాల్లోనే నిలదొక్కుకుని ఫ్యాప్సీ ఉత్తమ ఔత్సాహిక మహిళ అవార్డుకు, ఐఎస్‌బీ వాళ్ల బిజినెస్‌మేనేజ్‌మెంట్ కోర్సుకు ఎంపికయ్యాను.

అమ్మాయిలకు ఆలంబన... నా దగ్గర ప్రస్తుతానికి ఇరవైమంది అమ్మాయిలు పనిచేస్తున్నారు. పెద్ద అర్హతలున్నవారికి వేరే ఉద్యోగాలు ఉన్నాయి. అందుకే నా దగ్గర ఉద్యోగం కావాలని వచ్చేవారి అర్హతలు తక్కువ ఉన్నా పట్టించుకోను. పని పట్ల వారి ఇష్టాన్నేచూస్తాను. అలా అని కేవలం పని చూసి ఊరుకోను. అమ్మాయిలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరమని చెప్పి వాళ్ల జీతంలో ఎంతో కొంత సేవింగ్ చేయిస్తాను.

వాళ్లు సేవింగ్ చేస్తున్నారా? లేదా? అని ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటాను కూడా. అమ్మాయిల జీవితం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియదు కాబట్టి, వారికి ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక ప్రణాళిక అవసరమనుకుంటాను. ఇలాంటి ప్రణాళిక ఉండబట్టే కొద్దికాలంలోనే నా పిల్లలకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చగలిగాను. ఇప్పటికీ వారికి ఏది అవసరమైనా నేనే చూసుకుంటాను.


రేపటి ఉదయం కోసం... ఈరోజుతోనే అంతా సమాప్తం కాదు. అందుకు నా జీవితమే పెద్ద ఉదాహరణ అనుకుంటాను. ఏం చేయాలో తోచని పరిస్థితిలో అనఘ మొదలు పెట్టిన నేను అనుకోకుండానే షబానా అజ్మీ నటించిన "మార్నింగ్ రాగ'' సినిమాకు తొలిసారి కాస్ట్యూమ్స్ అందించాను. తరువాత దర్శకుడు వంశీ "ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు'', "దొంగరాముడు అండ్ పార్టీ'' సినిమాల కోసం, అలాగే శేఖర్ కమ్ముల తన "లీడర్, ఆనంద్'' సినిమాలకు, ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో హీరోయిన్స్‌కు కాస్ట్యూమ్స్ ఇచ్చాను. కొన్ని సినిమాల్లో తల్లి పాత్రలకు నన్ను తీసుకున్నారు కూడా. ఇలాంటివన్నీ సరదా వ్యాపకాల్లాంటివి. మంచి చేనేత వస్త్రాల నందించడమే నాకు ప్రధానం. అందుకే చాలామంది ప్రముఖులు చేనేత వస్త్రాల కోసం నన్నే సంప్రదిస్తారు. ఆ తృప్తి ఒక్కటి చాలు నాకు.

"నా జీవితంలో ఎంతో విలువైన కాలాన్ని నీకిచ్చాన''ని ఆయనతో నేనంటే...దానికి జవాబిస్తూ నా భర్త "ఇమ్మని నిన్నెవడు అడిగాడు?'' అంటూ నిలదీసాడు. అప్పుడే అర్థమైంది ఇకపై నాది ఒంటరి ప్రయాణమని.

- Andhra Jyothi Daily