Showing posts with label art. Show all posts
Showing posts with label art. Show all posts

Wednesday, May 16, 2012

అనఘనగా ఓ విజేత

నలభై ఐదేళ్ల వయసులో ఒక మహిళ ఒంటరిగా జీవితాన్ని ఆరంభించి గెలవడం అనుకున్నంత సులభం కాదు. అయితే అసాధ్యమూ కాదని చావళి సర్వమంగళ అంటున్నారు. కట్టుబట్టలతో కన్నవారింట్లో అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు కొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. ఐఎస్‌బి బిజినెస్‌మేనేజ్‌మెంట్ కోర్సుకు ఎంపికై, ఫ్యాప్సీ ఉత్తమ ఔత్సాహిక మహిళ అవార్డును కూడా అందుకున్నారు. సర్వమంగళ జీవితంలోని చీకటి వెలుగులు ఆమె మాటల్లోనే...http://www.indiaprline.com/wp-content/uploads/2012/05/Ms.-Sarvamangala-Chavali-of-Anagha-seen-showcasing-range-from-the-Handloom-Designer-and-Fashion-Blouses-Collection-launched-by-Anagha.jpg?9d7bd4
ఒక భార్య ఓడిపోయేదెప్పుడు? ఇది చిన్న ప్రశ్నలా కనిపించవచ్చు కానీ నేను నిలువనీడ కోల్పోయినప్పుడు పడ్డ వేదన మాటల్లో చెప్పలేనిది. ఒక కూతురిగా నేను గెలిచాను. నా కాళ్లపై నేను నిలదొక్కుకున్నాను. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక, కాపురం కోసం అన్నీ వదులుకుని నేను నాకు కూడా మిగలకుండా అయిపోయినా సరే భార్యగా ఓడిపోయాను. 

45 ఏళ్ల వయసులో ఒంటరినైపోయాను. అలాంటి సమయంలో మా నాన్నే నన్ను ఆదుకోకపోయుంటే నా బతుకు ఏమయ్యేదో!. నాన్న నుంచి ఆర్థికసహాయం అందుకుని భార్యనై కోల్పోయిన జీవితాన్ని ఒక స్త్రీగా పొందడానికి పోరాడాను.
నేల నుంచి నింగిపైకి... మాది మధ్యతరగతి కుంటుంబమైనా, ఆర్థిక సమస్యలేమీలేవు. పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపూర్ మా సొంతూరు. నాన్న పైలట్ కావడంతో నా బాల్యమంతా ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, అస్సాంలలో గడిచింది. 

అస్సాంలో హోం సైన్స్ చదవుతుండగానే నాకు ఎంతో ఇష్టమైన ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం కోసం కలలు కంటూ, దానికోసం నిరంతర ప్రయత్నాలు చేస్తుండేదాన్ని. మొత్తానికి 1986 సంవత్సరంలో నా కల సాకారమయ్యింది. సెలబ్రిటీలను దగ్గరి నుంచి చూడటం, కొత్త ప్రదేశాలు తిరగడం, మంచి జీతం తీసుకోవడం...ఏదో లోకంలో గడుపుతున్నట్టుగా కాలం గడిచింది.

జవానుకో సలామ్... ఎయిర్‌హోస్టెస్‌గా తక్కువ కాలమే చేసినా అవన్నీ మరచిపోలేని జ్ఞాపకాలగానే ఉండిపోయాయి. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, రేఖ, సునీల్ గవాస్కర్, దేశ దేశాల క్రికెట్ ఆటగాళ్ల పలకరింపులు...ఇవన్నీ ఎంతో థ్రిల్ కలిగించేవి. అందరికంటే సునీల్ గవాస్కర్ మా పట్ల సహృదయత చూపేవారు. శ్రీలంకకు శాంతి సైన్యాలు వెళ్లిన చాపర్‌లలో నేనూ పనిచేశాను. జవాన్లు ఎక్కడ ఉన్నారో వారికే తెలియదు.                 
వారంతా తమ ఇంటి చిరునామాలిచ్చి, భార్య పేరున ఉత్తరం రాయమనే వారిలా... " నేను బావున్నా. అమ్మా, నాన్నల ఆరోగ్యం జాగ్రత్త. బాబుకి ముద్దులు'' ఇంతే సమాచారం. ఇంటి వాళ్లు తిరిగి జవాబు రాయడం కోసం నా చిరునామా ఇవ్వాలని బ్రతిమాలేవారు. ఈ పని నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చినా ఎన్నో ఉత్తరాలకు ఒకే విషయం రాసేటపుడు ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగేవి కావు. తరువాత కొద్దికాలానికే వివాహం జరగడంతో ఆ జీవితాన్ని విడిచిపెట్టేయాల్సొచ్చింది.

నింగి నుంచి పాతాళంలోకి... ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగంలో చేరినపుడు నాలుగేళ్ల వరకు వివాహానికి దూరంగా ఉంటామని అంగీకార పత్రం సమర్పిస్తాము. ఒక వేళ దీన్ని ఉల్లంఘిస్తే ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందే. ఎయిర్‌హోస్టెస్‌గా మూడేళ్లు గడిచాయో లేదో మంచి సంబంధం వచ్చిందని ఇంటోవాళ్లు వివాహానికి ఒప్పించారు.అలా అస్సాంలోని ఉద్యోగ జీవితం వదిలి వివాహ జీవితంలో అడుగుపెట్టేందుకు హైదరాబాద్ వచ్చేశాను. ఏ లోటు లేకుండా పెళ్లి జరిగినా కొద్ది రోజులకే వేధింపులు మొదలయ్యాయి.
http://cdn-o360.batoi.com/wp-content/uploads/2012/05/Untitled-111-300x163.png
దాంతో ఆయనే ఏదైనా వ్యాపకం పెట్టుకోమనడంతో చేనేత బట్టల వ్యాపారాన్ని ఎంచుకున్నాను. మంగళగిరి, నారాయణపేట, చీర్యాల, భట్టిప్రోలుతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంచి చేనేత వస్త్రాలు తీసుకువచ్చి వ్యాపారం చేశాను. ఆ పని చేసినన్ని రోజులూ ఏనాడూ నా కోసం రూపాయి కూడా తీసుకోలేదు. అదంతా కుటుంబ సేవగానే భావించాను. కానీ బయట ఎలా ఉన్నా ఇంటికెళ్లాక ఎప్పటిలాగే పరిస్థితి దారుణంగా ఉండేది.

ఒంటరి ప్రయాణంలో... వ్యవహారం చివరకు కొట్టడం వరకు వెళ్లింది. అప్పటికే ఇద్దరు పిల్లలున్నారు నాకు. చూస్తుండగానే 26 ఏళ్ల వివాహం జీవితం గడిచింది. అయినప్పటికీ దెబ్బలు తినటాన్ని భరించలేకపోయాను. అక్కడి నుంచి బయటపడిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ ఇంట్లో నా కంటూ ఏమీ మిగలలేదు. నా తరపున ఎవరూ మాట్లాడలేదు. కట్టుబట్టలతో నాన్న దగ్గరకు వెళ్లిపోయాను. నా పట్ల ఆయన అన్నిరకాల బాధ్యతలు నిర్వర్తించి ఉన్నారు. దాంతో వెళ్లాలా? వద్దా? అని సతమతమై గత్యంతరం లేనిపరిస్థితిలో ఆయన దగ్గరకే వెళ్లాను. మూడు నెలలు భారంగా గడిచాయి.

అప్పటికే చేనేత వస్త్రాలతో పరిచయం ఉండటంతో నాన్న దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకుని 2007లో 'అనఘ' చేనేత వస్త్రాల దుకాణం మొదలు పెట్టాను. పూర్వ పరిచయాల వల్ల లక్షల రూపాయల మెటీరియల్‌ను అప్పుగా ఇవ్వడానికి చేనేత కార్మికులు అంగీకరించారు. 


ఇంటికి వెళితే వేదన చుట్టిముడుతుందని అనఘలోనే సమయమంతా గడిపేదాన్ని. రెండు సంవత్సరాల్లోనే నిలదొక్కుకుని ఫ్యాప్సీ ఉత్తమ ఔత్సాహిక మహిళ అవార్డుకు, ఐఎస్‌బీ వాళ్ల బిజినెస్‌మేనేజ్‌మెంట్ కోర్సుకు ఎంపికయ్యాను.

అమ్మాయిలకు ఆలంబన... నా దగ్గర ప్రస్తుతానికి ఇరవైమంది అమ్మాయిలు పనిచేస్తున్నారు. పెద్ద అర్హతలున్నవారికి వేరే ఉద్యోగాలు ఉన్నాయి. అందుకే నా దగ్గర ఉద్యోగం కావాలని వచ్చేవారి అర్హతలు తక్కువ ఉన్నా పట్టించుకోను. పని పట్ల వారి ఇష్టాన్నేచూస్తాను. అలా అని కేవలం పని చూసి ఊరుకోను. అమ్మాయిలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరమని చెప్పి వాళ్ల జీతంలో ఎంతో కొంత సేవింగ్ చేయిస్తాను.

వాళ్లు సేవింగ్ చేస్తున్నారా? లేదా? అని ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటాను కూడా. అమ్మాయిల జీవితం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియదు కాబట్టి, వారికి ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక ప్రణాళిక అవసరమనుకుంటాను. ఇలాంటి ప్రణాళిక ఉండబట్టే కొద్దికాలంలోనే నా పిల్లలకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చగలిగాను. ఇప్పటికీ వారికి ఏది అవసరమైనా నేనే చూసుకుంటాను.


రేపటి ఉదయం కోసం... ఈరోజుతోనే అంతా సమాప్తం కాదు. అందుకు నా జీవితమే పెద్ద ఉదాహరణ అనుకుంటాను. ఏం చేయాలో తోచని పరిస్థితిలో అనఘ మొదలు పెట్టిన నేను అనుకోకుండానే షబానా అజ్మీ నటించిన "మార్నింగ్ రాగ'' సినిమాకు తొలిసారి కాస్ట్యూమ్స్ అందించాను. తరువాత దర్శకుడు వంశీ "ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు'', "దొంగరాముడు అండ్ పార్టీ'' సినిమాల కోసం, అలాగే శేఖర్ కమ్ముల తన "లీడర్, ఆనంద్'' సినిమాలకు, ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో హీరోయిన్స్‌కు కాస్ట్యూమ్స్ ఇచ్చాను. కొన్ని సినిమాల్లో తల్లి పాత్రలకు నన్ను తీసుకున్నారు కూడా. ఇలాంటివన్నీ సరదా వ్యాపకాల్లాంటివి. మంచి చేనేత వస్త్రాల నందించడమే నాకు ప్రధానం. అందుకే చాలామంది ప్రముఖులు చేనేత వస్త్రాల కోసం నన్నే సంప్రదిస్తారు. ఆ తృప్తి ఒక్కటి చాలు నాకు.

"నా జీవితంలో ఎంతో విలువైన కాలాన్ని నీకిచ్చాన''ని ఆయనతో నేనంటే...దానికి జవాబిస్తూ నా భర్త "ఇమ్మని నిన్నెవడు అడిగాడు?'' అంటూ నిలదీసాడు. అప్పుడే అర్థమైంది ఇకపై నాది ఒంటరి ప్రయాణమని.

- Andhra Jyothi Daily

Friday, March 30, 2012

వరిగుడ్ కృష్ణమూర్తి

వరిగడ్డి, వెదురుకర్ర, ఈతాకు, జొన్నఈనెలు, చిప్పెరకంకి, తుంగలతో వ్యవసాయానికి వాడే పరికరాలను ఎన్నో తయారుచేశారు చీరాలకు చెందిన మువ్వా చినకృష్ణమూర్తి. ఇందుకు ఆయన జాతీయ స్థాయిలో ఆదర్శరైతుగా ఎంపికయ్యారు కూడా. ఇవే కాకుండా ఈయన వరిగడ్డితో చీర, రవికె, హ్యాండ్‌బ్యాగులు కూడా తయారుచేశారు. వరిగడ్డితో ఇన్ని వస్తువులా అని మనం ఆశ్చర్యపోవడం సహజం. అదెలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

"వరిగడ్డి, వెదురుకర్ర, ఈతాకు, జొన్న ఈనెలు, చిప్పెరకంకి, తుంగలతో నాగలి, గొర్రు, మోకులు, పగ్గం, ఎద్దులకు పట్టెళ్లు, చిక్కాలు, వారెన, తాళ్లు మొదలైనవెన్నో తయారుచేశాను. వాటిని గతంలో కూడా అనేక ప్రదర్శనలలో ప్రదర్శించి బహుమతులు అందుకున్నాను. ఈ నెల మూడో తేదీన ఢిల్లీలో జరిగిన కృషి విజ్ఞాన మేళాలో ప్రదర్శించినపుడు జాతీయ స్థాయిలో ఆదర్శరైతుగా నన్ను ఎంపికచేశారు. కేంద్ర మాజీ మంత్రి సోంపాల్ సింగ్ శాస్త్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. ఈ పురస్కారం 70వ పడిలో పడిన నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.

ఇలా వినూత్నంగా వస్తువులు రూపొందించాలనే ఆలోచన 1959లో వీరన్నపాలెంలో జరిగిన పశుప్రదర్శన చూసినపుడు మొదటిసారి కలిగింది. అప్పుడు నేను కొమ్మర్నేనివారిపాలెంలో ఉండేవాడ్ని. ఆ ప్రదర్శన చూసినపుడు ఇది పశువుల ప్రదర్శనకే పరిమితమా లేక రైతులు భిన్నంగా ఏవైనా తయారుచేసినా ఇందులో ప్రదర్శించొచ్చా అనే సందేహం కలిగింది. అక్కడే ఉన్న పశువైద్యులు ఉమా నాగేశ్వరరావు, రామచంద్రారెడ్డి గార్ల వద్ద నాకొచ్చిన సందేహాన్ని వ్యక్తం చేశాను.

'ప్రదర్శించొచ్చు కాకపోతే అవి పదిమంది మెచ్చేలా ఉండాలి' అన్నారు వాళ్లు. ఆ మాటలు నాలో కొత్త ఆలోచనల్ని రేపాయి. అలా మొదటిసారి వరిగడ్డితో చెర్నాకోలా తయారుచేశాను. దాన్ని 1960లో గుంటూరులో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో ఉంచి మొదటి బహుమతి గెలుచుకున్నాను. ఆ తరువాత చీరాలలో 1972లో జరిగిన ప్రదర్శనలో కూడా నేను తయారుచేసిన వస్తువులు మొదటి బహుమతి అందుకున్నాయి. విజయవాడలో 1988లో జరిగిన ఆరవ మహానాడులో వరిగడ్డి, తుంగ, జొన్నఈనెలతో నేను తయారుచేసిన వస్తువుల్ని చూసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నన్ను అభినందించారు.

మగ్గం వాడకుండానే...
తరువాత కొన్నేళ్లకు మద్రాసులో 25 మంది కళాకారులు 245 దారపు ఉండలతో ఓ వస్త్రాన్ని తయారుచేసి కరుణానిధికి బహుకరించిన విషయం పత్రికల్లో చదివాను. అలాగే చీరాల మండలం ఈపురుపాలెంకు చెందిన కూరపాటి సుబ్బారావు అనే చేనేత కార్మికుడు కుప్పడం రకం చీరను తయారుచేసి పలువురు ప్రశంసలు పొందినట్టు కూడా పత్రికల్లో చదివాను. అవి చూశాక వరిగడ్డితో చీరెందుకు రూపొందించకూడదనే ఆలోచన వచ్చింది. సీతమ్మ తల్లి నార వస్త్రాలు ధరించిందని పురాణాల్లో చదివాం.

అలానే మగ్గంతో పనిలేకుండా వరిగడ్డితో కూడా చీరలు తయారుచేయొచ్చు అనిపించింది. మూడు నెలల పాటు శ్రమించి జనపనార పేనినట్టుగానే చేతితోనే చీరను తయారుచేశాను. దేశ సమగ్రతను చాటే విధంగా చీర అంచుకు త్రివర్ణాలను అద్దాను. రంగులు అద్దేందుకు కూడా కొంత శ్రమ పడాల్సి వచ్చింది. మొదట వెజిటబుల్ డైస్ అద్దితే గడ్డికి పట్టలేదు. అందుకని పెయింట్‌లు వాడాను.

అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టరు ఉదయలక్ష్మి గడ్డి చీర బాగుందని మెచ్చుకుని ప్రోత్సహించడంతో రవికె, హ్యాండ్‌బ్యాగ్‌లు కూడా గడ్డితోనే తయారుచేశాను. కత్తెర పెట్టకుండా ఎద్దుకి చిక్కాలను అల్లినట్టు రవికె అల్లాను. నాలుగు గజాల ఈ చీరను ప్రదర్శనలో ఉంచితే నేత చీర అనుకున్నారు చాలామంది మహిళలు. చేత్తో ముట్టుకుని చూస్తేనే కాని అది గడ్డితో తయారైందనే విషయం తెలియలేదు. పొట్టకూటికోసం పొలం పని, పశుపోషణ చేస్తున్న నాకు కళాకారులకు ఇచ్చే పింఛన్ ఇస్తే మరిన్ని కళారూపాలను తయారుచేయగలను'' అని చెప్పారు చినకృష్ణమూర్తి.
- రావిపాటి శ్రీనివాసరావు
  చీరాల

సంగీతానికి ఆ శక్తి ఉంది...

చుట్టూ వందల ఎకరాల్లో విస్తరించిన పచ్చని తోటలు, నగరం నీడ లేని ప్రశాంత వాతావరణం, నిరాడంబరమైన రెండు గదుల నివాసం - వెరసి మనం వచ్చింది గొప్ప పేరుప్రఖ్యాతులున్న ఒక సంగీత విద్వాంసుడి దగ్గరకేనా - అనే అనుమానం కలుగుతుంది వంకాయల నరసింహం ఇంటి మెట్లెక్కుతున్నప్పుడు. విజయనగరం సమీపంలోని గుడిలోవ 'విజ్ఞాన విహార' పాఠశాలలో అటు సైన్సు, ఇటు సంగీతం బోధిస్తూ, తూనీగ వంటి ఉత్సాహంతో కనిపించిన ఈ మృదంగ విద్వాంసుడికి ఎన భయ్యేళ్లు నిండాయంటే ఎవ్వరూ నమ్మలేరు. మన రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకిచ్చే అత్యున్నత 'కళారత్న - హంస' పురస్కారాన్ని రేపుఅందుకోబోతున్న సందర్భంగా ఆయనను 'నవ్య' పలకరించింది.

ముందు నుంచీ సంగీత కుటుంబమే కదా మీది?
అవును. మా ముత్తాత పురందరదాస శిష్యులు. తర్వాతి తరంలో వంకాయల బలరామ్మూర్తిగారు సత్యభామ వేషం వేసి తూర్పు భాగవతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన తమ్ముడైన మా తాత నరసింహంగారు మృదంగం వాయించేవారు. భజన సంప్రదాయమూ మా ఇంట్లో ముందునుంచీ ఉంది. మా నాన్నమ్మ, అమ్మ నన్ను ఒళ్లో కూచోబెట్టుకుని కీర్తనలు పాడుతూ, కదలకుండా వింటే రోజుకు దమ్మిడీ ఇచ్చేవారు. అలా నాకు పాట, మృదంగం చిన్నవయసులోనే పట్టుబడ్డాయి. మా అబ్బాయి వంకాయల రమణమూర్తి అంతర్జాతీయంగా పేరు పొందిన మార్దంగికుడు. మనవడూ ఈ బాటలోనే నడుస్తున్నాడు.

మీ సంగీత ప్రయాణం గురించి చెప్పండి...
1975వరకూ విజయనగరం మున్సిపల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాను. తర్వాత 90 వరకూ ఆకాశవాణిలో మృదంగ విద్వాంసుడిగా పనిచేశాను. అక్కడ నేను చేసిన కార్యక్రమాలు నాకు చాలా సంతృప్తినిచ్చాయి. అన్నమయ్య కన్నా ముందువాడైన కృష్ణమాచార్య రాసిన 'సింహగిరి వచనాలు' కొన్ని సంపాదించి వాటిని గానం చేసి ప్రసారం చేశాను. మరుగునపడిన మన వాగ్గేయకారులు కొవ్వలి నరసింహదాసు, తూము నరసింహదాసు వంటి వారి కీర్తనలను ప్రచారంలోకి తీసుకురావడానికి ఆకాశవాణి ద్వారా కృషి చేశాను. మహా విద్వాంసులు ఆదిభట్ల నారాయణదాసు ప్రశంసలందుకున్నాననే సంతోషం నాకిప్పటికీ తరగని ఆస్తి. డీకే పట్టమ్మాళ్, ద్వారం నాయుడు, ఈమని, దోమాడ చిట్టబ్బాయి వంటి మహామహులతో పాటు కచేరీల్లో పాల్గొన్నాననే సంతృప్తి నా సొంతం.

సైన్స్ - సంగీతం ఏది బోధించడం సులువు? మీకు దేనిలో సంతృప్తి?
సైన్స్‌లో సంగీతం ఉంది, సంగీతంలో సైన్స్ ఉంది. నాకు రెండూ నచ్చిన విషయాలే. నిజానికి సైన్సు, సంగీతం ఒకదానికొకటి విరుద్ధమైనవి కానేకావు, అవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి.

ఇప్పటితరానికి సంప్రదాయ సంగీతం అవసరమేనా?
ఒకసారి ఆస్ట్రియా నుంచి హెర్మన్ అనే వ్యక్తి మృదంగం మీద పరిశోధన చెయ్యడానికి వచ్చాడు. ఒకనాటి సాయంత్రం ఆరింటికి వచ్చి కూర్చుని సంప్రదాయ సంగీతం గురించి ఇలాగే ప్రశ్నలు వేస్తున్నాడు. 'జో అచ్యుతానంద...' అన్న కీర్తనను అతనికి మంద్రంగా పాడి వినిపించాను. పూర్తయ్యేపాటికి చూస్తే అతని కళ్లు అరమూతలు పడుతూ, ఆవలింతలు వస్తున్నాయి. 'ఇదేమిటి, నాకీ సమయంలో నిద్ర రాకూడదే... మీరు పాడిన పాటేదో మాయ చేసింది' అన్నాడతను కాసేపటికి. సంగీతానికున్న గొప్పదనం అది.

సంగీతమంటే శరీరాన్ని కదిలించి నరాల్లో ఊపును తీసుకొచ్చేది కాదు, ఆత్మను కదిలించేది. హృదయాన్ని విశాలం చేసి అత్యున్నతమైన మానవత్వాన్ని మేల్కొల్పేది.దానికి దేశభాషలు అడ్డంకులు కానేకావు. ప్రపంచాన్ని ఒక్కటి చెయ్యగల శక్తి దాని సొంతం. అందుకే నేటి తరం సంగీతాన్ని తప్పనిసరిగా అభ్యసించాలి. సంగీతం తోడుంటే విద్యార్థుల్లో నిరాశ, నిస్పృహ, ప్రతి చిన్నదానికీ ఆందోళన పడటం వంటివన్నీ తొలగిపోతాయి. ఇక్కడినుంచి వెళ్లాక హెర్మన్ 'స్పిరిచ్యువల్ అండ్ సోషల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ మృదంగం' అనే మంచి పుస్తకాన్ని రాశాడు.

మీరు అభివృద్ధి చేస్తున్న సంగీత పాఠశాల గురించి చెప్పండి....
విజయనగరానికి చేరువలో ఉన్న 'విజ్ఞాన విహార' పాఠశాల దేశవ్యాప్తంగా మంచి పేరు పొందింది. నేనిందులో చేరాక 'భారతీ కళా విహార' పేరుతో సంగీత పాఠశాలను ప్రారంభించాం. మొదటిరోజు ప్రారంభోత్సవానికి నలుగురు విద్యార్థులను బతిమాలి తీసుకొచ్చి కూర్చోపెట్టాల్సిన పరిస్థితి. అలాంటిది నేడు 82మంది విద్యార్థులున్నారు. ముప్ఫై మంది మృదంగం, మరో ముప్ఫైమంది గాత్రం, పాతికమంది వీణ, వయొలిన్ నేర్చుకుంటున్నారు.

ఇదిగాక కొందరు గృహిణులు అన్నమాచార్య, త్యాగరాజు స్వాముల వారి కీర్తనలను అభ్యసిస్తున్నారు. ముందు చెప్పానే సంగీతానికి ఎంతో శక్తి ఉందని - మా విద్యార్థి ఒకబ్బాయికి ఆయాసం ఉంది. ఆర్నెల్లపాటు గాత్ర సంగీతం సాధన చేశాక అది తగ్గింది. ఇటువంటి 'సైడ్ ఎఫెక్ట్స్' సంగీతం వల్ల చాలానే ఉంటాయి. అందుకే స్కూల్లో ఉన్న ఆరొందల మంది విద్యార్థులకూ శతక పద్యాల వంటివి రాగయుక్తంగా, భావస్ఫోరకంగా, సంగీతాత్మకంగా చెబుతుంటాం.

టీవీ ఛానెళ్లు, రియాలిటీ షోలు యువతను సంగీతం వైపు ప్రోత్సహిస్తున్నాయంటారా?
కొంచెం అవును, కొంచెం కాదు. వాటిలో పాల్గొన్న వారు టీవీలో కనిపించడం, ఆ నిమిషానికి పలువురి మెప్పూ పొందడం, వాళ్లు ప్రకటించిన భారీ బహుమతులు అందుకోవడం ఇవన్నీ తక్షణమే లభించే ఫలితాలు. సంగీతాన్ని సాధన చేసి ఒకో మెట్టూ పైకెదగడం అనేది దీర్ఘకాలం సాగే ప్రక్రియ. దానివల్ల పైనచెప్పినట్టు హృదయ వైశాల్యం పెరిగి మనిషి దైవస్వరూపుడిగా మారతాడు.

ఈ విషయాన్ని గురువులు చిన్నారులకు తెలియజెప్పాలి. ఎల్కేజీలో చేరే పిల్లాడికి 'బాగా చదువుకోరా, నువ్వు పెద్ద సైంటిస్టువు అవుతావు' అంటే అర్థం కాదు. బడిలో చాక్లెట్లు బిస్కెట్లు పంచుతారు, కొత్త నేస్తాలొస్తారు అంటే వాడు స్కూలుకొస్తాడు. టీవీ కార్యక్రమాల పాత్ర అంతవరకే. వాటివల్ల యువతరంలో సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతోంది. దాన్ని పెంచి పోషించి సంగీత ప్రాముఖ్యతను వారికర్థమయ్యేలా ప్రోత్సహించవలసింది గురువులే.

మీకు రావలసినంత గుర్తింపు రాలేదనే బాధ ఉందా?
'రానిది రాదు, పోనిది పోదు... అడిగి సుఖములెవరనుభవించితిరా రామా?' అంటారు త్యాగరాజస్వామి. నాదీ అదే పద్ధతి. సంతృప్తి ఉన్నప్పుడే మనిషి ఆనందంగా జీవించగలడు. నాకన్నా నా కుమారుడు, శిష్యులు పత్రి సతీశ్ కుమార్, బీవీఎస్ భాస్కర్, సద్గురు చరణ్ వంటివారు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు, అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. అది నాకెంతో సంతృప్తినిచ్చే విషయం.

నా గురువులు శ్రీపాద సన్యాసిరావు, ముళ్లపూడి లక్ష్మణరావు వంటివారు డబ్బు ఆశించి నాకు విద్య నేర్పలేదు. ఒక కొడుకులా చూసుకుని ఏ వేళప్పుడు ఏ సందేహం అడిగినా తీర్చేవారు. నేనూ నా విద్యార్థులకు అలా మెలుగుతున్నానా, అంత గొప్ప గురుకుల సంప్రదాయానికి దివిటీనై నిలబడ్డానా లేదా అన్నదే నాకు ప్రధానం. ఇప్పుడీ 'కళారత్న' వచ్చింది, సంతోషమే. ఏవో కేంద్ర అవార్డులు రాలేదే అని బాధపడను.

ఆత్మీయత అర్థమయింది...
"చాలా ఏళ్ల క్రితం మృదంగం నేర్చుకుంటానంటూ బిల్ అనే ఒక పద్దెనిమిదేళ్ల అమెరికన్ యువతి మా ఇంటికొచ్చింది. వచ్చినప్పుడు చిన్న నిక్కరు, టీషర్టు వేసుకుంది. ఆమెను చూడటానికి చుట్టుపక్కల జనం పోగయ్యారు. ఆమెను లోపలికి పిలిచి మా ఆవిడకు అప్పజెప్పి చీరకట్టి తీసుకురమ్మన్నా.

తర్వాత వారమే మా అమ్మాయి పెళ్లి జరిగి ఆమె అత్తవారింటికి వెళుతున్నప్పుడు మేం ఏడవడం చూసి బిల్ ఒకటే నవ్వు. 'ఆ అమ్మాయి హాయిగా పెళ్లి చేసుకుని వెళుతుంటే మీ ఏడుపేంట'ని అడిగింది. 'ఆత్మీయత' అని చెపితే ఇంకా పెద్దగా నవ్వింది. ఆర్నెల్ల పాటు మృదంగం నేర్చుకుని స్వదేశానికి వెళ్లిపోయే సమయం వచ్చినప్పుడు బిల్ ఒకటే ఏడుపు.

'హాయిగా సొంతదేశానికి, అమ్మానాన్నల దగ్గరకు వెళుతున్నావుగా, ఏడుపెందుకూ' అని మేమడిగాం. 'ఈ ఆర్నెల్లలో భారతీయ సంగీతం నాకు ఆత్మీయతను, మమకారాన్నీ పంచింది. అంతకుముందు అవేమీ తెలియవు...' అంటూ కళ్లు తుడుచుకుంది. ఇప్పటికీ ఆమె నిండైన చీరకట్టులో వచ్చి పలకరిస్తుంది. మృదంగాన్ని అద్భుతంగా పలికిస్తుంది

Friday, December 16, 2011

కాగితపు గుజ్జుతో కళాకృతులు

chinthalaagdish 
రంగు, రంగుల కాగితాల ముక్కలను ఒకదానిపై మరొకదాన్ని అందమైన ఆకృతులను సృష్టించే రీతిలో అంటించడాన్ని పర్‌ కొలేజస్‌ అంటారు. సాధారణంగా ఇలాంటి కొలేజస్‌ బల్లపరుపుగా ఉంటాయి. కానీ జగదీష్‌ కొలేజస్‌ వీటికి పూర్తి భిన్నమైనవి. ఇవి త్రీ డైమెన్షనల్‌ తరహాలో ఉంటాయి. వసంతకాలం నుండి వేసవి కాలం వరకు వివిధ రుతువులను ప్రతిబింబించే కొలేజస్‌ ఇవి. పాశ్చాత్య ప్రపంచంలోని వాతావరణానికి సంబంధించినవే అయినప్పటికీ వాటిలోని అద్వితీయ నైపుణ్యం చూసే ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది.

art1 
1956లో హైదరాబాదులో జగదీష్‌ జన్మించారు. తండ్రి ఉద్యోగరీత్యా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అనేక ప్రాంతాలకు మారుతూ ఉండటంతో ఆ జిల్లాలోని గ్రామీణ జీవనం అన్ని పార్శ్వాలను ఆకళింపుచేసుకున్నారు జగదీష్‌. వాటిలో భాగంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ జానపద కళారీతులను ఆ తర్వాత కళలో ఇముడ్చుకున్నాడు. జగదీష్‌ హైదరాబాదు, జెఎన్‌టియులో ఐదేళ్ల ఆర్ట్‌ డిప్లొమాను 1978లో పూర్తిచేశారు. 1980 నుండి బరోడా ఎంఎస్‌ విశ్వవిద్యాలయంలో మ్యూరల్‌ డిజైన్‌లో రెండేళ్ల పోస్ట్‌ డిప్లొమా చేశారు. అక్కడే కెజి సుబ్రమణియన్‌ లాంటి నిష్ణాతుల వద్ద శిక్షణ పొందారు.

art2 
దేశ విదేశాలలో విశేష ఖ్యాతినార్జించిన హైదరాబాదుకు చెందిన కళాకారుడు జగదీష్‌ చింతల. ఆయన అద్భుత కళాప్రస్థానాన్ని సూచిస్తూ ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ తన ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కొంతకాలం క్రితం ఏర్పాటు చేసిన సోలో ప్రదర్శన ప్రేక్షకులను ఆశ్చర్యంతో, ఆనందంతో తన్మయులను గావించింది. సాధారణంగా గ్యాలరీల్లో ప్రదర్శన అనగానే గోడలకు తగిలించిన అందమైన చిత్రాలు, లేదా కొలువుతీరిన శిల్పాలు మన కళ్లముందు గోచరిస్తాయి.

art3 
ఒక్కసారి ఆయన ప్రదర్శన తిలకించిన వారికి అది ఎందువల్ల సాధ్యమయిందో స్పష్టమవుతుంది.ముందుగా చూడగానే మొట్టమొదట ఆకట్టుకునేవి పేపర్‌ కొలేజస్‌. పేపర్‌ కొలేజస్‌ అంటే రంగు, రంగుల కాగితాల ముక్కలను ఒకదానిపై మరొకదాన్ని అందమైన ఆకృతులను సృష్టించే రీతిలో అంటించడం. సాధారణంగా ఇలాంటి కొలేజస్‌ బల్లపరుపుగా ఉంటాయి. కానీ జగదీష్‌ రూపొందించిన కొలేజస్‌ వీటికి పూర్తి భిన్నమైనవి.

jagdish1 
ఇవి త్రీ డైమెన్షనల్‌ తరహాలో ఉంటాయి. వసంత కాలం నుండి వేసవి కాలం వరకు వివిధ రుతువులను ప్రతిబింబించే కొలేజస్‌ ఇవి. పాశ్చాత్య ప్రపంచంలోని వాతావరణానికి సంబంధించినవే అయినప్పటికీ వాటిలోని అద్వితీయ నైపుణ్యం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. వివిధ రుతువులను సూచించే చెట్లు, ఆకులు, పుష్పాలు, వాటికి అనువైన వర్ణాలు- వాటన్నింటినీ అమర్చిన తీరు ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఇవి కాకుండా కేవలం ఒకే ఒక్క పుష్పాన్ని పెద్ద ఆకారంలో కొలేజ్‌గా రూపొందించినవి కాగితాలతో ఎంతటి అద్భుత సృష్ట్టినైనా చేయవచ్చుననడానికి ఇవి నిదర్శనాలు.