Friday, March 30, 2012

వరిగుడ్ కృష్ణమూర్తి

వరిగడ్డి, వెదురుకర్ర, ఈతాకు, జొన్నఈనెలు, చిప్పెరకంకి, తుంగలతో వ్యవసాయానికి వాడే పరికరాలను ఎన్నో తయారుచేశారు చీరాలకు చెందిన మువ్వా చినకృష్ణమూర్తి. ఇందుకు ఆయన జాతీయ స్థాయిలో ఆదర్శరైతుగా ఎంపికయ్యారు కూడా. ఇవే కాకుండా ఈయన వరిగడ్డితో చీర, రవికె, హ్యాండ్‌బ్యాగులు కూడా తయారుచేశారు. వరిగడ్డితో ఇన్ని వస్తువులా అని మనం ఆశ్చర్యపోవడం సహజం. అదెలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

"వరిగడ్డి, వెదురుకర్ర, ఈతాకు, జొన్న ఈనెలు, చిప్పెరకంకి, తుంగలతో నాగలి, గొర్రు, మోకులు, పగ్గం, ఎద్దులకు పట్టెళ్లు, చిక్కాలు, వారెన, తాళ్లు మొదలైనవెన్నో తయారుచేశాను. వాటిని గతంలో కూడా అనేక ప్రదర్శనలలో ప్రదర్శించి బహుమతులు అందుకున్నాను. ఈ నెల మూడో తేదీన ఢిల్లీలో జరిగిన కృషి విజ్ఞాన మేళాలో ప్రదర్శించినపుడు జాతీయ స్థాయిలో ఆదర్శరైతుగా నన్ను ఎంపికచేశారు. కేంద్ర మాజీ మంత్రి సోంపాల్ సింగ్ శాస్త్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. ఈ పురస్కారం 70వ పడిలో పడిన నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.

ఇలా వినూత్నంగా వస్తువులు రూపొందించాలనే ఆలోచన 1959లో వీరన్నపాలెంలో జరిగిన పశుప్రదర్శన చూసినపుడు మొదటిసారి కలిగింది. అప్పుడు నేను కొమ్మర్నేనివారిపాలెంలో ఉండేవాడ్ని. ఆ ప్రదర్శన చూసినపుడు ఇది పశువుల ప్రదర్శనకే పరిమితమా లేక రైతులు భిన్నంగా ఏవైనా తయారుచేసినా ఇందులో ప్రదర్శించొచ్చా అనే సందేహం కలిగింది. అక్కడే ఉన్న పశువైద్యులు ఉమా నాగేశ్వరరావు, రామచంద్రారెడ్డి గార్ల వద్ద నాకొచ్చిన సందేహాన్ని వ్యక్తం చేశాను.

'ప్రదర్శించొచ్చు కాకపోతే అవి పదిమంది మెచ్చేలా ఉండాలి' అన్నారు వాళ్లు. ఆ మాటలు నాలో కొత్త ఆలోచనల్ని రేపాయి. అలా మొదటిసారి వరిగడ్డితో చెర్నాకోలా తయారుచేశాను. దాన్ని 1960లో గుంటూరులో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో ఉంచి మొదటి బహుమతి గెలుచుకున్నాను. ఆ తరువాత చీరాలలో 1972లో జరిగిన ప్రదర్శనలో కూడా నేను తయారుచేసిన వస్తువులు మొదటి బహుమతి అందుకున్నాయి. విజయవాడలో 1988లో జరిగిన ఆరవ మహానాడులో వరిగడ్డి, తుంగ, జొన్నఈనెలతో నేను తయారుచేసిన వస్తువుల్ని చూసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నన్ను అభినందించారు.

మగ్గం వాడకుండానే...
తరువాత కొన్నేళ్లకు మద్రాసులో 25 మంది కళాకారులు 245 దారపు ఉండలతో ఓ వస్త్రాన్ని తయారుచేసి కరుణానిధికి బహుకరించిన విషయం పత్రికల్లో చదివాను. అలాగే చీరాల మండలం ఈపురుపాలెంకు చెందిన కూరపాటి సుబ్బారావు అనే చేనేత కార్మికుడు కుప్పడం రకం చీరను తయారుచేసి పలువురు ప్రశంసలు పొందినట్టు కూడా పత్రికల్లో చదివాను. అవి చూశాక వరిగడ్డితో చీరెందుకు రూపొందించకూడదనే ఆలోచన వచ్చింది. సీతమ్మ తల్లి నార వస్త్రాలు ధరించిందని పురాణాల్లో చదివాం.

అలానే మగ్గంతో పనిలేకుండా వరిగడ్డితో కూడా చీరలు తయారుచేయొచ్చు అనిపించింది. మూడు నెలల పాటు శ్రమించి జనపనార పేనినట్టుగానే చేతితోనే చీరను తయారుచేశాను. దేశ సమగ్రతను చాటే విధంగా చీర అంచుకు త్రివర్ణాలను అద్దాను. రంగులు అద్దేందుకు కూడా కొంత శ్రమ పడాల్సి వచ్చింది. మొదట వెజిటబుల్ డైస్ అద్దితే గడ్డికి పట్టలేదు. అందుకని పెయింట్‌లు వాడాను.

అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టరు ఉదయలక్ష్మి గడ్డి చీర బాగుందని మెచ్చుకుని ప్రోత్సహించడంతో రవికె, హ్యాండ్‌బ్యాగ్‌లు కూడా గడ్డితోనే తయారుచేశాను. కత్తెర పెట్టకుండా ఎద్దుకి చిక్కాలను అల్లినట్టు రవికె అల్లాను. నాలుగు గజాల ఈ చీరను ప్రదర్శనలో ఉంచితే నేత చీర అనుకున్నారు చాలామంది మహిళలు. చేత్తో ముట్టుకుని చూస్తేనే కాని అది గడ్డితో తయారైందనే విషయం తెలియలేదు. పొట్టకూటికోసం పొలం పని, పశుపోషణ చేస్తున్న నాకు కళాకారులకు ఇచ్చే పింఛన్ ఇస్తే మరిన్ని కళారూపాలను తయారుచేయగలను'' అని చెప్పారు చినకృష్ణమూర్తి.
- రావిపాటి శ్రీనివాసరావు
  చీరాల

No comments: