Friday, March 30, 2012

సంగీతానికి ఆ శక్తి ఉంది...

చుట్టూ వందల ఎకరాల్లో విస్తరించిన పచ్చని తోటలు, నగరం నీడ లేని ప్రశాంత వాతావరణం, నిరాడంబరమైన రెండు గదుల నివాసం - వెరసి మనం వచ్చింది గొప్ప పేరుప్రఖ్యాతులున్న ఒక సంగీత విద్వాంసుడి దగ్గరకేనా - అనే అనుమానం కలుగుతుంది వంకాయల నరసింహం ఇంటి మెట్లెక్కుతున్నప్పుడు. విజయనగరం సమీపంలోని గుడిలోవ 'విజ్ఞాన విహార' పాఠశాలలో అటు సైన్సు, ఇటు సంగీతం బోధిస్తూ, తూనీగ వంటి ఉత్సాహంతో కనిపించిన ఈ మృదంగ విద్వాంసుడికి ఎన భయ్యేళ్లు నిండాయంటే ఎవ్వరూ నమ్మలేరు. మన రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకిచ్చే అత్యున్నత 'కళారత్న - హంస' పురస్కారాన్ని రేపుఅందుకోబోతున్న సందర్భంగా ఆయనను 'నవ్య' పలకరించింది.

ముందు నుంచీ సంగీత కుటుంబమే కదా మీది?
అవును. మా ముత్తాత పురందరదాస శిష్యులు. తర్వాతి తరంలో వంకాయల బలరామ్మూర్తిగారు సత్యభామ వేషం వేసి తూర్పు భాగవతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన తమ్ముడైన మా తాత నరసింహంగారు మృదంగం వాయించేవారు. భజన సంప్రదాయమూ మా ఇంట్లో ముందునుంచీ ఉంది. మా నాన్నమ్మ, అమ్మ నన్ను ఒళ్లో కూచోబెట్టుకుని కీర్తనలు పాడుతూ, కదలకుండా వింటే రోజుకు దమ్మిడీ ఇచ్చేవారు. అలా నాకు పాట, మృదంగం చిన్నవయసులోనే పట్టుబడ్డాయి. మా అబ్బాయి వంకాయల రమణమూర్తి అంతర్జాతీయంగా పేరు పొందిన మార్దంగికుడు. మనవడూ ఈ బాటలోనే నడుస్తున్నాడు.

మీ సంగీత ప్రయాణం గురించి చెప్పండి...
1975వరకూ విజయనగరం మున్సిపల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాను. తర్వాత 90 వరకూ ఆకాశవాణిలో మృదంగ విద్వాంసుడిగా పనిచేశాను. అక్కడ నేను చేసిన కార్యక్రమాలు నాకు చాలా సంతృప్తినిచ్చాయి. అన్నమయ్య కన్నా ముందువాడైన కృష్ణమాచార్య రాసిన 'సింహగిరి వచనాలు' కొన్ని సంపాదించి వాటిని గానం చేసి ప్రసారం చేశాను. మరుగునపడిన మన వాగ్గేయకారులు కొవ్వలి నరసింహదాసు, తూము నరసింహదాసు వంటి వారి కీర్తనలను ప్రచారంలోకి తీసుకురావడానికి ఆకాశవాణి ద్వారా కృషి చేశాను. మహా విద్వాంసులు ఆదిభట్ల నారాయణదాసు ప్రశంసలందుకున్నాననే సంతోషం నాకిప్పటికీ తరగని ఆస్తి. డీకే పట్టమ్మాళ్, ద్వారం నాయుడు, ఈమని, దోమాడ చిట్టబ్బాయి వంటి మహామహులతో పాటు కచేరీల్లో పాల్గొన్నాననే సంతృప్తి నా సొంతం.

సైన్స్ - సంగీతం ఏది బోధించడం సులువు? మీకు దేనిలో సంతృప్తి?
సైన్స్‌లో సంగీతం ఉంది, సంగీతంలో సైన్స్ ఉంది. నాకు రెండూ నచ్చిన విషయాలే. నిజానికి సైన్సు, సంగీతం ఒకదానికొకటి విరుద్ధమైనవి కానేకావు, అవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి.

ఇప్పటితరానికి సంప్రదాయ సంగీతం అవసరమేనా?
ఒకసారి ఆస్ట్రియా నుంచి హెర్మన్ అనే వ్యక్తి మృదంగం మీద పరిశోధన చెయ్యడానికి వచ్చాడు. ఒకనాటి సాయంత్రం ఆరింటికి వచ్చి కూర్చుని సంప్రదాయ సంగీతం గురించి ఇలాగే ప్రశ్నలు వేస్తున్నాడు. 'జో అచ్యుతానంద...' అన్న కీర్తనను అతనికి మంద్రంగా పాడి వినిపించాను. పూర్తయ్యేపాటికి చూస్తే అతని కళ్లు అరమూతలు పడుతూ, ఆవలింతలు వస్తున్నాయి. 'ఇదేమిటి, నాకీ సమయంలో నిద్ర రాకూడదే... మీరు పాడిన పాటేదో మాయ చేసింది' అన్నాడతను కాసేపటికి. సంగీతానికున్న గొప్పదనం అది.

సంగీతమంటే శరీరాన్ని కదిలించి నరాల్లో ఊపును తీసుకొచ్చేది కాదు, ఆత్మను కదిలించేది. హృదయాన్ని విశాలం చేసి అత్యున్నతమైన మానవత్వాన్ని మేల్కొల్పేది.దానికి దేశభాషలు అడ్డంకులు కానేకావు. ప్రపంచాన్ని ఒక్కటి చెయ్యగల శక్తి దాని సొంతం. అందుకే నేటి తరం సంగీతాన్ని తప్పనిసరిగా అభ్యసించాలి. సంగీతం తోడుంటే విద్యార్థుల్లో నిరాశ, నిస్పృహ, ప్రతి చిన్నదానికీ ఆందోళన పడటం వంటివన్నీ తొలగిపోతాయి. ఇక్కడినుంచి వెళ్లాక హెర్మన్ 'స్పిరిచ్యువల్ అండ్ సోషల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ మృదంగం' అనే మంచి పుస్తకాన్ని రాశాడు.

మీరు అభివృద్ధి చేస్తున్న సంగీత పాఠశాల గురించి చెప్పండి....
విజయనగరానికి చేరువలో ఉన్న 'విజ్ఞాన విహార' పాఠశాల దేశవ్యాప్తంగా మంచి పేరు పొందింది. నేనిందులో చేరాక 'భారతీ కళా విహార' పేరుతో సంగీత పాఠశాలను ప్రారంభించాం. మొదటిరోజు ప్రారంభోత్సవానికి నలుగురు విద్యార్థులను బతిమాలి తీసుకొచ్చి కూర్చోపెట్టాల్సిన పరిస్థితి. అలాంటిది నేడు 82మంది విద్యార్థులున్నారు. ముప్ఫై మంది మృదంగం, మరో ముప్ఫైమంది గాత్రం, పాతికమంది వీణ, వయొలిన్ నేర్చుకుంటున్నారు.

ఇదిగాక కొందరు గృహిణులు అన్నమాచార్య, త్యాగరాజు స్వాముల వారి కీర్తనలను అభ్యసిస్తున్నారు. ముందు చెప్పానే సంగీతానికి ఎంతో శక్తి ఉందని - మా విద్యార్థి ఒకబ్బాయికి ఆయాసం ఉంది. ఆర్నెల్లపాటు గాత్ర సంగీతం సాధన చేశాక అది తగ్గింది. ఇటువంటి 'సైడ్ ఎఫెక్ట్స్' సంగీతం వల్ల చాలానే ఉంటాయి. అందుకే స్కూల్లో ఉన్న ఆరొందల మంది విద్యార్థులకూ శతక పద్యాల వంటివి రాగయుక్తంగా, భావస్ఫోరకంగా, సంగీతాత్మకంగా చెబుతుంటాం.

టీవీ ఛానెళ్లు, రియాలిటీ షోలు యువతను సంగీతం వైపు ప్రోత్సహిస్తున్నాయంటారా?
కొంచెం అవును, కొంచెం కాదు. వాటిలో పాల్గొన్న వారు టీవీలో కనిపించడం, ఆ నిమిషానికి పలువురి మెప్పూ పొందడం, వాళ్లు ప్రకటించిన భారీ బహుమతులు అందుకోవడం ఇవన్నీ తక్షణమే లభించే ఫలితాలు. సంగీతాన్ని సాధన చేసి ఒకో మెట్టూ పైకెదగడం అనేది దీర్ఘకాలం సాగే ప్రక్రియ. దానివల్ల పైనచెప్పినట్టు హృదయ వైశాల్యం పెరిగి మనిషి దైవస్వరూపుడిగా మారతాడు.

ఈ విషయాన్ని గురువులు చిన్నారులకు తెలియజెప్పాలి. ఎల్కేజీలో చేరే పిల్లాడికి 'బాగా చదువుకోరా, నువ్వు పెద్ద సైంటిస్టువు అవుతావు' అంటే అర్థం కాదు. బడిలో చాక్లెట్లు బిస్కెట్లు పంచుతారు, కొత్త నేస్తాలొస్తారు అంటే వాడు స్కూలుకొస్తాడు. టీవీ కార్యక్రమాల పాత్ర అంతవరకే. వాటివల్ల యువతరంలో సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతోంది. దాన్ని పెంచి పోషించి సంగీత ప్రాముఖ్యతను వారికర్థమయ్యేలా ప్రోత్సహించవలసింది గురువులే.

మీకు రావలసినంత గుర్తింపు రాలేదనే బాధ ఉందా?
'రానిది రాదు, పోనిది పోదు... అడిగి సుఖములెవరనుభవించితిరా రామా?' అంటారు త్యాగరాజస్వామి. నాదీ అదే పద్ధతి. సంతృప్తి ఉన్నప్పుడే మనిషి ఆనందంగా జీవించగలడు. నాకన్నా నా కుమారుడు, శిష్యులు పత్రి సతీశ్ కుమార్, బీవీఎస్ భాస్కర్, సద్గురు చరణ్ వంటివారు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు, అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. అది నాకెంతో సంతృప్తినిచ్చే విషయం.

నా గురువులు శ్రీపాద సన్యాసిరావు, ముళ్లపూడి లక్ష్మణరావు వంటివారు డబ్బు ఆశించి నాకు విద్య నేర్పలేదు. ఒక కొడుకులా చూసుకుని ఏ వేళప్పుడు ఏ సందేహం అడిగినా తీర్చేవారు. నేనూ నా విద్యార్థులకు అలా మెలుగుతున్నానా, అంత గొప్ప గురుకుల సంప్రదాయానికి దివిటీనై నిలబడ్డానా లేదా అన్నదే నాకు ప్రధానం. ఇప్పుడీ 'కళారత్న' వచ్చింది, సంతోషమే. ఏవో కేంద్ర అవార్డులు రాలేదే అని బాధపడను.

ఆత్మీయత అర్థమయింది...
"చాలా ఏళ్ల క్రితం మృదంగం నేర్చుకుంటానంటూ బిల్ అనే ఒక పద్దెనిమిదేళ్ల అమెరికన్ యువతి మా ఇంటికొచ్చింది. వచ్చినప్పుడు చిన్న నిక్కరు, టీషర్టు వేసుకుంది. ఆమెను చూడటానికి చుట్టుపక్కల జనం పోగయ్యారు. ఆమెను లోపలికి పిలిచి మా ఆవిడకు అప్పజెప్పి చీరకట్టి తీసుకురమ్మన్నా.

తర్వాత వారమే మా అమ్మాయి పెళ్లి జరిగి ఆమె అత్తవారింటికి వెళుతున్నప్పుడు మేం ఏడవడం చూసి బిల్ ఒకటే నవ్వు. 'ఆ అమ్మాయి హాయిగా పెళ్లి చేసుకుని వెళుతుంటే మీ ఏడుపేంట'ని అడిగింది. 'ఆత్మీయత' అని చెపితే ఇంకా పెద్దగా నవ్వింది. ఆర్నెల్ల పాటు మృదంగం నేర్చుకుని స్వదేశానికి వెళ్లిపోయే సమయం వచ్చినప్పుడు బిల్ ఒకటే ఏడుపు.

'హాయిగా సొంతదేశానికి, అమ్మానాన్నల దగ్గరకు వెళుతున్నావుగా, ఏడుపెందుకూ' అని మేమడిగాం. 'ఈ ఆర్నెల్లలో భారతీయ సంగీతం నాకు ఆత్మీయతను, మమకారాన్నీ పంచింది. అంతకుముందు అవేమీ తెలియవు...' అంటూ కళ్లు తుడుచుకుంది. ఇప్పటికీ ఆమె నిండైన చీరకట్టులో వచ్చి పలకరిస్తుంది. మృదంగాన్ని అద్భుతంగా పలికిస్తుంది

No comments: