Saturday, March 31, 2012

శ్రీ రాముడు...మా రాముడు..నేను

ముప్పైఏళ్లక్రితం ఆయనొక మొక్కు మొక్కుకున్నాడు. తన స్నేహితుడు సమితి ప్రెసిడెంటుగా గెలిస్తే భద్రాచలం రామాలయానికి వెళ్లి తలనీలాలిస్తానని. భద్రాద్రిరాముడు ఆయన కోరిక తీర్చాడు. వెంటనే ఆ భక్తుడు తన మొక్కు తీర్చుకున్నాడు. అక్కడితో రాముని బాకీ తీరిపోయిందని అనుకున్నాడు. కాని తారకరామునికి భద్రాద్రి రామునికి మధ్య తానొక వారిధిగా పనిచేసి మరిన్ని మొక్కులు చెల్లించాల్సి ఉంటుందని ఊహించలేదాయన. ఎనిమిదేళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన భద్రాచలాన్ని తన సొంతూరిలా చూసుకున్నారు. ఆయనే తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. ఆయన ఊరి విశేషాలే ఈ 'మా ఊరు'.
"యాభైఏళ్లనాడు మా ఊరి ప్రజలు భద్రాచలానికి నడుచుకుంటూనే వెళ్లేవారు. బాగా డబ్బున్నవాళ్లయితే ఎడ్లబండ్లమీద వెళ్లేవారు. అడవి మార్గాన అడ్డదారిలో వెళితే రామాలయం మా ఊరికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉండేది. మా ఊరివాళ్లకు రాముడు ఎప్పుడు గుర్తుకువస్తే అప్పుడు కాలినడకనే భద్రాచలం వెళ్లిపోయేవారు. మా ఊరి పేరు చెప్పినా, శ్రీరాముడి పేరు చెప్పినా మా ఊరునుంచి మోటార్‌సైకిల్‌పై వెళ్లి స్వామివారికి చెల్లించుకున్న మొక్కు గుర్తుకువస్తుంది నాకు. నాకప్పటికి పాతికేళ్లు ఉంటాయేమో... నేను యూత్ రాజకీయాల్లో ఉన్నరోజులవి. నా స్నేహితుడ్ని సమితి ప్రెసిడెంటుగా నిలబెట్టాను. వాడు గెలిచి మా టీం పరువు నిలబెడితే రాముడికి తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాను. నేను కోరుకున్నట్టే జరిగింది.

ఎన్నికల ఫలితాలు తెలియగానే మోటర్‌సైకిల్ తీసుకుని భద్రాచలానికి ఒక్కడ్నే బయలుదేరిపోయాను. ఊరు దాటి, సగం దూరం వెళ్లాక కిన్నెరసాని నదిలోనుంచి వెళ్లాల్సి వచ్చింది. నదిపైన లోలెవల్ బ్రిడ్జి ఒకటి ఉండేది. దానిపైన ఎప్పుడూ మోకాలి ఎత్తు నీరు వెళుతూ ఉండేది. నీటి ప్రవాహం మెల్లగానే ఉంది కదా...మోటర్‌సైకిల్‌పై వెళ్లిపోవచ్చని బండిని వంతెనపై నడిపించుకుంటూ వెళ్లాను. సగం దూరం వెళ్లగానే కిన్నెరసాని నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతా సెకన్లలోనే జరిగిపోయింది. నీటి తాకిడికి బండి ముందుకు కాకుండా పక్కకు వెళ్లిపోతోంది. ఒక్క రెండు అడుగులు పక్కకు జరిగితే వాగులో పడిపోతాను.

ఒక్క నిమిషం గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఒంట్లో ఉన్న బలాన్నంతా కూడదీసుకుని బండితో నీళ్లకు ఎదురు నడిచాను. అప్పటికి నీటి ఉధృతి కొద్దిగా తగ్గింది. బతుకు జీవుడా అంటూ గట్టుకు చేరుకున్నాను. 'నీ దర్శనం కోసం బయలుదేరితే ఏకంగా నీ దగ్గరికే తీసుకుని వెళ్లిపోతావా స్వామీ...ఇక ఏ ఆటంకాలు రానివ్వకు రామా....' అనుకుంటూ భద్రాచలం చేరుకున్నాను. రాముడ్ని దర్శించుకుని, తలనీలాలిచ్చి ఊరికి తిరిగొచ్చాను. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగుల్ల పల్లే మా ఊరు. నా చిన్నప్పుడు మా ఊర్లో ఓ నలభై ఇళ్లకు మించి ఉండేవి కావు. గిరిజనులు, మేము కలిసే ఉండేవాళ్లం.

పాలు కొనేవారు కాదు... మా తాతకు వందల ఎకరాల భూమి ఉండేది. మా నాన్న(లక్ష్మయ్య) కూడా మంచి రైతే. పొలంతో పాటు వందల సంఖ్యలో పశువులు ఉండేవి. వరి, ఉలవలు, నువ్వులు, జొన్నలు, బొబ్బర్లు పండించేవారు. అప్పటికి వ్యవసాయ బోర్లు వంటి సౌకర్యాలు లేవు. దాదాపుగా అన్నీ మెట్ట పంటలే. వరి, కూరగాయల వంటివి పండించుకోవాలంటే మోట తోలించేవారు. ఊళ్లో మంచినీటికోసం ప్రత్యేకంగా బావులేమీ ఉండేవి కావు. అందరూ బిందెలు పట్టుకుని మోటాబావి దగ్గరకి వెళ్లి వరుసలో నిలబడేవారు. మా ఊరి నేల మంచిది. పంటలు బాగా పండేవి. ధాన్యాలన్నీ సంచుల్లోకి వచ్చే సమయానికి షావుకార్లు ఎడ్ల బండ్లు వేసుకుని వచ్చి ఊరి మధ్యలో కూర్చునేవారు. రైతులంతా తమ పంటల ఖరీదులు తెలుసుకుని సరుకంతా బేరం పెట్టి షాపుకార్లకు అమ్మేసేవారు. రైతులతో పనైపోయాక..షావుకార్లు ఇళ్ల దగ్గరికి వచ్చేవారు. అప్పుడు మా నాయనమ్మ నెయ్యిబిందె పట్టుకుని బయటకు వచ్చేది.

అప్పట్లో మహిళలకు బోలెడు సంపాదన ఉండేది. ఇంట్లో ఖర్చులకే కాదు బంగారం కొనుక్కోడానికి కూడా మగాళ్ల దగ్గర చెయ్యిచాపేవారు కాదు. కారణం పశువులు. మా ఇంట్లో గేదెలు, ఆవులు అన్నీ కలిపి వందకు పైగా ఉండేవి. పాలు ఎవరూ కొనేవారు కాదు. ఎందుకంటే అందరి ఇళ్లలో పాడి ఉండేది. కేవలం నెయ్యి మాత్రమే తయారుచేసేవారు. ప్రతి రెండు మూడు వారాలకు ఊళ్లో ఆడవాళ్లంతా షాపుకార్లకు నెయ్యి అమ్మేవారు.

బడిలేని గ్రామం...
మాది చాలా చిన్న గ్రామం. అంటే ఇళ్లు చాలా తక్కువగా ఉండేవని చెప్పా కదా. వ్యవసాయ భూములు చాలా ఉండేవి. అడవికి దగ్గరగా ఉండడం వల్ల గిరిజన జనాభా బాగా ఉండేవారు. ఊళ్లో ఎంత సంపద ఉన్నా...బడి అనే పదం మాత్రం వినిపించేది కాదు. దాదాపు 300 మంది జనాభా ఉన్న గ్రామం...అయినా ఒక పాఠశాల పెడితే బాగుండు అన్న ఆలోచన కూడా ఉండేది కాదు. నేను మా పెద్దమ్మగారి ఊర్లో నాలుగో తరగతి వరకూ చదువుకున్నాను. ఆ తరువాత సత్తుపల్లి, ఖమ్మం, హైదరాబాద్‌లలో నా చదువు కొనసాగింది. బీకామ్‌తో చదువు ఆపేసి రాజకీయాల్లోకి వచ్చాను. ఊళ్లో జనాభా పెరిగి రవాణా సౌకర్యం వచ్చాకే పాఠశాల వచ్చింది.

అడవి సంపద...
ఊరి జనమంతా ఏడాదికొకసారి ఏలూరు వెళ్లి సరుకులు కొనుక్కునేవారు. నాలుగే నాలుగు సరుకులు. టీ పొడి, మసాలా దినుసులు, బెల్లం బుట్ట, ఉప్పు కట్ట. అంతే. ఏడాదివరకూ దుకాణంతో పని ఉండేది కాదు. మిగిలినవన్నీ మాకు ఊళ్లో లేదా పక్కనే ఉన్న అడవిలో దొరికేవి. నూనె దగ్గర నుంచి పప్పుల వరకూ సమస్తం ఇంట్లో ఉండేవి. నాకు బాగా గుర్తు...నా చిన్నప్పుడు అడవికి వెళ్లి కూరలు తెమ్మనేవారు. బోడకాకరగాయలు, బుడం కాయలు, పుట్టకొక్కులు వంటి వన్నీ ఎక్కడ బడితే అక్కడ ఉండేవి. కోసి తెచ్చేవాళ్లం. ఇంటి ముందు నీడకోసం వేసుకునే పందిర్లనిండా ఆనపకాయలు, చిక్కుడు కాయలు, దొండకాయలు ఎప్పుడూ కాస్తూనే ఉండేవి. గిరిజనులైతే వారికి దొరికినవన్నీ తీసుకొచ్చి ఇస్తుండేవారు. మేమిచ్చినవి ఎంతో ఆనందంగా తీసుకునేవారు. మా ఇంట్లో సరుకులతో పాటు ధాన్యం, జొన్నలు మట్టిలో పాతర వేసి భద్రపరుచుకునేవాళ్లం. ఊళ్లో ఎవరికైనా అవసరం వస్తే లేదనకుండా వెంటనే ఇచ్చేవాళ్లం.

మా ఊళ్లో రాముడు... మా ఊళ్లో గుడి ఉండేది కాదు. కాని శ్రీరామనవమి వస్తే మాత్రం ఊరి మధ్యలో వేపచెట్టుకింద నాలుగు రాటలు పాతి, కొబ్బరాకులతో చిన్న పందిరి వేసి రాముని బొమ్మ పెట్టి పూజ చేసి ఊరివారందరికీ పానకం పోసేవారు. అంతకు మించి పెద్ద హడావిడి చేసేవారు కాదు. మేము పెద్దయ్యాక నాన్నే ముందుకు వచ్చి ఊరి ప్రజలతో మాట్లాడి ఊళ్లో రాముని గుడి కట్టించాడు. ఊరి ప్రజలు కూడా ఎవరికి తోచిన సాయం వారు చేశారు. అప్పుడు నేను పియుసి చదువుతున్నాను. రాములవారికి మొదటి కల్యాణం నాన్నే చేయించాడు. ఊరి ప్రజలందరికీ భోజనం పెట్టాడు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. మా ఊళ్లో రామ భక్తులు ఎక్కువ. అయితే వీళ్లెవరూ శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లరు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా రోజుల్లోనే వెళ్లి చక్కగా దర్శనం చేసుకుని పాపికొండలు వెళ్లి కాలక్షేపం చేసుకుని వస్తారు.

ఇప్పటికీ ఊళ్లోనే....
మా ఊళ్లో రామాలయం వచ్చాక భద్రాచలం వెళ్లడం బాగా తగ్గిపోయింది. చంద్రబాబుగారి హయాంలో నేను మంత్రి అయినపుడు నా ఊరొక్కటే కాదు మా జిల్లా రూపురేఖలన్నీ మారిపోయాయి. విద్య, వైద్యం, వ్యవసాయ శాఖల దగ్గరికెళ్లి మా జిల్లాకి కావాల్సిన పనులన్నీ చేయించుకునేవాడ్ని. ముఖ్యంగా మా ఊళ్లో రోడ్లు, పారిశుధ్యం, నీటి సౌకర్యం...అన్నీ బాగా అభివృద్ధి చెందాయి. నేను ఇప్పటికీ ఊళ్లోనే ఉంటున్నాను కాబట్టి ఏ చిన్న సమస్య ఉన్నా...నా దృష్టికి వస్తుంది. మిగతా జిల్లాలవారికి నేను రాజకీయ నాయకుడిగా తెలిసినా... మా ఊరి ప్రజలు మాత్రం నన్ను రైతుగానే చూస్తారు. చుట్టుపక్కల గిరిజనులైతే కనిపించగానే 'తుమ్మలన్నా...' అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. నా పిల్లలంతా హైదారాబాద్‌లో, విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఊళ్లోని ఇంట్లో నేను, నా భార్య మాత్రమే ఉంటున్నాం. పొలాలు, పశువులు చూసుకుంటాం.  
'' ఊరి ప్రజల మధ్య హాయిగా గడచిపోతోంది జీవితం.'' 

ఆ రాముని ఆజ్ఞ...

నేను డిగ్రీ చదువుతున్న సమయంలో నాన్న చనిపోయారు. దాంతో డిగ్రీ పూర్తిచేసుకుని ఊరికి వచ్చేశాను. పలుగు పార పట్టుకోవడం తప్పలేదు. నాన్నలాగే మంచి రైతుని అనిపించుకోవడం కంటే మరో ప్రత్యామ్నాయం లేదు. తరువాత రాజకీయాల్లోకి వెళ్లాను. గ్రామ పంచాయితి నుంచి సమితి ఎన్నికల వరకూ యూత్ పాలిటిక్స్‌లో చాలా చురుగ్గా పాల్గొన్నాను. అదే సమయంలో ఎన్‌టిఆర్ తన పార్టీలో స్థానం కల్పించారు. సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌గారు రామాలయం ధర్మకర్తల మండలిలో నన్ను సభ్యునిగా పెట్టారు. 'ఇప్పటివరకూ రాముని కళ్యాణం చేయాలంటే తిరుపతి వెంకటేశ్వరుని దగ్గర్నుంచి అప్పు తెస్తున్నారు.

భవిష్యత్తులో రాముడే మిగతా దేవాలయాలకు డబ్బులివ్వాలి. ఆ స్థాయికి ఈ దేవాలయాన్ని తీసికెళ్లాలంటే భక్తులొక్కరే సరిపోరు. దేశ విదేశాల నుంచి పర్యాటకులు కూడా భద్రాచలానికి రావాలి. దానికోసం నేను ఏమి చెయ్యడానికైనా సిద్ధమే. నువ్వు మాత్రమే చిత్తశుద్ధితో ఆ పని చేయగలవు' అని ఎన్టీఆర్‌గారు నాతో అన్న మాటల్ని నిజం చేయడానికి సిద్ధపడ్డాను. ఆలయం పక్కన కరకట్ట నిర్మాణం, స్టేడియం, కళ్యాణ మండపం, పార్కులు, పాపికొండల దగ్గర రామాయణ కథ చెప్పే శిల్పాలు, విశాలమైన రహదారులు...ఒకటేమిటి అన్ని పనులూ చేయించాం. ఆ మహత్కార్యంలో నన్నూ భాగస్వామిని చేసినందుకు ఆ శ్రీరాముడికి, మా రాముడికి(ఎన్టీఆర్)ఎప్పటికీ రుణపడి ఉంటాను.

Friday, March 30, 2012

వరిగుడ్ కృష్ణమూర్తి

వరిగడ్డి, వెదురుకర్ర, ఈతాకు, జొన్నఈనెలు, చిప్పెరకంకి, తుంగలతో వ్యవసాయానికి వాడే పరికరాలను ఎన్నో తయారుచేశారు చీరాలకు చెందిన మువ్వా చినకృష్ణమూర్తి. ఇందుకు ఆయన జాతీయ స్థాయిలో ఆదర్శరైతుగా ఎంపికయ్యారు కూడా. ఇవే కాకుండా ఈయన వరిగడ్డితో చీర, రవికె, హ్యాండ్‌బ్యాగులు కూడా తయారుచేశారు. వరిగడ్డితో ఇన్ని వస్తువులా అని మనం ఆశ్చర్యపోవడం సహజం. అదెలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

"వరిగడ్డి, వెదురుకర్ర, ఈతాకు, జొన్న ఈనెలు, చిప్పెరకంకి, తుంగలతో నాగలి, గొర్రు, మోకులు, పగ్గం, ఎద్దులకు పట్టెళ్లు, చిక్కాలు, వారెన, తాళ్లు మొదలైనవెన్నో తయారుచేశాను. వాటిని గతంలో కూడా అనేక ప్రదర్శనలలో ప్రదర్శించి బహుమతులు అందుకున్నాను. ఈ నెల మూడో తేదీన ఢిల్లీలో జరిగిన కృషి విజ్ఞాన మేళాలో ప్రదర్శించినపుడు జాతీయ స్థాయిలో ఆదర్శరైతుగా నన్ను ఎంపికచేశారు. కేంద్ర మాజీ మంత్రి సోంపాల్ సింగ్ శాస్త్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. ఈ పురస్కారం 70వ పడిలో పడిన నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.

ఇలా వినూత్నంగా వస్తువులు రూపొందించాలనే ఆలోచన 1959లో వీరన్నపాలెంలో జరిగిన పశుప్రదర్శన చూసినపుడు మొదటిసారి కలిగింది. అప్పుడు నేను కొమ్మర్నేనివారిపాలెంలో ఉండేవాడ్ని. ఆ ప్రదర్శన చూసినపుడు ఇది పశువుల ప్రదర్శనకే పరిమితమా లేక రైతులు భిన్నంగా ఏవైనా తయారుచేసినా ఇందులో ప్రదర్శించొచ్చా అనే సందేహం కలిగింది. అక్కడే ఉన్న పశువైద్యులు ఉమా నాగేశ్వరరావు, రామచంద్రారెడ్డి గార్ల వద్ద నాకొచ్చిన సందేహాన్ని వ్యక్తం చేశాను.

'ప్రదర్శించొచ్చు కాకపోతే అవి పదిమంది మెచ్చేలా ఉండాలి' అన్నారు వాళ్లు. ఆ మాటలు నాలో కొత్త ఆలోచనల్ని రేపాయి. అలా మొదటిసారి వరిగడ్డితో చెర్నాకోలా తయారుచేశాను. దాన్ని 1960లో గుంటూరులో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో ఉంచి మొదటి బహుమతి గెలుచుకున్నాను. ఆ తరువాత చీరాలలో 1972లో జరిగిన ప్రదర్శనలో కూడా నేను తయారుచేసిన వస్తువులు మొదటి బహుమతి అందుకున్నాయి. విజయవాడలో 1988లో జరిగిన ఆరవ మహానాడులో వరిగడ్డి, తుంగ, జొన్నఈనెలతో నేను తయారుచేసిన వస్తువుల్ని చూసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నన్ను అభినందించారు.

మగ్గం వాడకుండానే...
తరువాత కొన్నేళ్లకు మద్రాసులో 25 మంది కళాకారులు 245 దారపు ఉండలతో ఓ వస్త్రాన్ని తయారుచేసి కరుణానిధికి బహుకరించిన విషయం పత్రికల్లో చదివాను. అలాగే చీరాల మండలం ఈపురుపాలెంకు చెందిన కూరపాటి సుబ్బారావు అనే చేనేత కార్మికుడు కుప్పడం రకం చీరను తయారుచేసి పలువురు ప్రశంసలు పొందినట్టు కూడా పత్రికల్లో చదివాను. అవి చూశాక వరిగడ్డితో చీరెందుకు రూపొందించకూడదనే ఆలోచన వచ్చింది. సీతమ్మ తల్లి నార వస్త్రాలు ధరించిందని పురాణాల్లో చదివాం.

అలానే మగ్గంతో పనిలేకుండా వరిగడ్డితో కూడా చీరలు తయారుచేయొచ్చు అనిపించింది. మూడు నెలల పాటు శ్రమించి జనపనార పేనినట్టుగానే చేతితోనే చీరను తయారుచేశాను. దేశ సమగ్రతను చాటే విధంగా చీర అంచుకు త్రివర్ణాలను అద్దాను. రంగులు అద్దేందుకు కూడా కొంత శ్రమ పడాల్సి వచ్చింది. మొదట వెజిటబుల్ డైస్ అద్దితే గడ్డికి పట్టలేదు. అందుకని పెయింట్‌లు వాడాను.

అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టరు ఉదయలక్ష్మి గడ్డి చీర బాగుందని మెచ్చుకుని ప్రోత్సహించడంతో రవికె, హ్యాండ్‌బ్యాగ్‌లు కూడా గడ్డితోనే తయారుచేశాను. కత్తెర పెట్టకుండా ఎద్దుకి చిక్కాలను అల్లినట్టు రవికె అల్లాను. నాలుగు గజాల ఈ చీరను ప్రదర్శనలో ఉంచితే నేత చీర అనుకున్నారు చాలామంది మహిళలు. చేత్తో ముట్టుకుని చూస్తేనే కాని అది గడ్డితో తయారైందనే విషయం తెలియలేదు. పొట్టకూటికోసం పొలం పని, పశుపోషణ చేస్తున్న నాకు కళాకారులకు ఇచ్చే పింఛన్ ఇస్తే మరిన్ని కళారూపాలను తయారుచేయగలను'' అని చెప్పారు చినకృష్ణమూర్తి.
- రావిపాటి శ్రీనివాసరావు
  చీరాల

సంగీతానికి ఆ శక్తి ఉంది...

చుట్టూ వందల ఎకరాల్లో విస్తరించిన పచ్చని తోటలు, నగరం నీడ లేని ప్రశాంత వాతావరణం, నిరాడంబరమైన రెండు గదుల నివాసం - వెరసి మనం వచ్చింది గొప్ప పేరుప్రఖ్యాతులున్న ఒక సంగీత విద్వాంసుడి దగ్గరకేనా - అనే అనుమానం కలుగుతుంది వంకాయల నరసింహం ఇంటి మెట్లెక్కుతున్నప్పుడు. విజయనగరం సమీపంలోని గుడిలోవ 'విజ్ఞాన విహార' పాఠశాలలో అటు సైన్సు, ఇటు సంగీతం బోధిస్తూ, తూనీగ వంటి ఉత్సాహంతో కనిపించిన ఈ మృదంగ విద్వాంసుడికి ఎన భయ్యేళ్లు నిండాయంటే ఎవ్వరూ నమ్మలేరు. మన రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకిచ్చే అత్యున్నత 'కళారత్న - హంస' పురస్కారాన్ని రేపుఅందుకోబోతున్న సందర్భంగా ఆయనను 'నవ్య' పలకరించింది.

ముందు నుంచీ సంగీత కుటుంబమే కదా మీది?
అవును. మా ముత్తాత పురందరదాస శిష్యులు. తర్వాతి తరంలో వంకాయల బలరామ్మూర్తిగారు సత్యభామ వేషం వేసి తూర్పు భాగవతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన తమ్ముడైన మా తాత నరసింహంగారు మృదంగం వాయించేవారు. భజన సంప్రదాయమూ మా ఇంట్లో ముందునుంచీ ఉంది. మా నాన్నమ్మ, అమ్మ నన్ను ఒళ్లో కూచోబెట్టుకుని కీర్తనలు పాడుతూ, కదలకుండా వింటే రోజుకు దమ్మిడీ ఇచ్చేవారు. అలా నాకు పాట, మృదంగం చిన్నవయసులోనే పట్టుబడ్డాయి. మా అబ్బాయి వంకాయల రమణమూర్తి అంతర్జాతీయంగా పేరు పొందిన మార్దంగికుడు. మనవడూ ఈ బాటలోనే నడుస్తున్నాడు.

మీ సంగీత ప్రయాణం గురించి చెప్పండి...
1975వరకూ విజయనగరం మున్సిపల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాను. తర్వాత 90 వరకూ ఆకాశవాణిలో మృదంగ విద్వాంసుడిగా పనిచేశాను. అక్కడ నేను చేసిన కార్యక్రమాలు నాకు చాలా సంతృప్తినిచ్చాయి. అన్నమయ్య కన్నా ముందువాడైన కృష్ణమాచార్య రాసిన 'సింహగిరి వచనాలు' కొన్ని సంపాదించి వాటిని గానం చేసి ప్రసారం చేశాను. మరుగునపడిన మన వాగ్గేయకారులు కొవ్వలి నరసింహదాసు, తూము నరసింహదాసు వంటి వారి కీర్తనలను ప్రచారంలోకి తీసుకురావడానికి ఆకాశవాణి ద్వారా కృషి చేశాను. మహా విద్వాంసులు ఆదిభట్ల నారాయణదాసు ప్రశంసలందుకున్నాననే సంతోషం నాకిప్పటికీ తరగని ఆస్తి. డీకే పట్టమ్మాళ్, ద్వారం నాయుడు, ఈమని, దోమాడ చిట్టబ్బాయి వంటి మహామహులతో పాటు కచేరీల్లో పాల్గొన్నాననే సంతృప్తి నా సొంతం.

సైన్స్ - సంగీతం ఏది బోధించడం సులువు? మీకు దేనిలో సంతృప్తి?
సైన్స్‌లో సంగీతం ఉంది, సంగీతంలో సైన్స్ ఉంది. నాకు రెండూ నచ్చిన విషయాలే. నిజానికి సైన్సు, సంగీతం ఒకదానికొకటి విరుద్ధమైనవి కానేకావు, అవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి.

ఇప్పటితరానికి సంప్రదాయ సంగీతం అవసరమేనా?
ఒకసారి ఆస్ట్రియా నుంచి హెర్మన్ అనే వ్యక్తి మృదంగం మీద పరిశోధన చెయ్యడానికి వచ్చాడు. ఒకనాటి సాయంత్రం ఆరింటికి వచ్చి కూర్చుని సంప్రదాయ సంగీతం గురించి ఇలాగే ప్రశ్నలు వేస్తున్నాడు. 'జో అచ్యుతానంద...' అన్న కీర్తనను అతనికి మంద్రంగా పాడి వినిపించాను. పూర్తయ్యేపాటికి చూస్తే అతని కళ్లు అరమూతలు పడుతూ, ఆవలింతలు వస్తున్నాయి. 'ఇదేమిటి, నాకీ సమయంలో నిద్ర రాకూడదే... మీరు పాడిన పాటేదో మాయ చేసింది' అన్నాడతను కాసేపటికి. సంగీతానికున్న గొప్పదనం అది.

సంగీతమంటే శరీరాన్ని కదిలించి నరాల్లో ఊపును తీసుకొచ్చేది కాదు, ఆత్మను కదిలించేది. హృదయాన్ని విశాలం చేసి అత్యున్నతమైన మానవత్వాన్ని మేల్కొల్పేది.దానికి దేశభాషలు అడ్డంకులు కానేకావు. ప్రపంచాన్ని ఒక్కటి చెయ్యగల శక్తి దాని సొంతం. అందుకే నేటి తరం సంగీతాన్ని తప్పనిసరిగా అభ్యసించాలి. సంగీతం తోడుంటే విద్యార్థుల్లో నిరాశ, నిస్పృహ, ప్రతి చిన్నదానికీ ఆందోళన పడటం వంటివన్నీ తొలగిపోతాయి. ఇక్కడినుంచి వెళ్లాక హెర్మన్ 'స్పిరిచ్యువల్ అండ్ సోషల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ మృదంగం' అనే మంచి పుస్తకాన్ని రాశాడు.

మీరు అభివృద్ధి చేస్తున్న సంగీత పాఠశాల గురించి చెప్పండి....
విజయనగరానికి చేరువలో ఉన్న 'విజ్ఞాన విహార' పాఠశాల దేశవ్యాప్తంగా మంచి పేరు పొందింది. నేనిందులో చేరాక 'భారతీ కళా విహార' పేరుతో సంగీత పాఠశాలను ప్రారంభించాం. మొదటిరోజు ప్రారంభోత్సవానికి నలుగురు విద్యార్థులను బతిమాలి తీసుకొచ్చి కూర్చోపెట్టాల్సిన పరిస్థితి. అలాంటిది నేడు 82మంది విద్యార్థులున్నారు. ముప్ఫై మంది మృదంగం, మరో ముప్ఫైమంది గాత్రం, పాతికమంది వీణ, వయొలిన్ నేర్చుకుంటున్నారు.

ఇదిగాక కొందరు గృహిణులు అన్నమాచార్య, త్యాగరాజు స్వాముల వారి కీర్తనలను అభ్యసిస్తున్నారు. ముందు చెప్పానే సంగీతానికి ఎంతో శక్తి ఉందని - మా విద్యార్థి ఒకబ్బాయికి ఆయాసం ఉంది. ఆర్నెల్లపాటు గాత్ర సంగీతం సాధన చేశాక అది తగ్గింది. ఇటువంటి 'సైడ్ ఎఫెక్ట్స్' సంగీతం వల్ల చాలానే ఉంటాయి. అందుకే స్కూల్లో ఉన్న ఆరొందల మంది విద్యార్థులకూ శతక పద్యాల వంటివి రాగయుక్తంగా, భావస్ఫోరకంగా, సంగీతాత్మకంగా చెబుతుంటాం.

టీవీ ఛానెళ్లు, రియాలిటీ షోలు యువతను సంగీతం వైపు ప్రోత్సహిస్తున్నాయంటారా?
కొంచెం అవును, కొంచెం కాదు. వాటిలో పాల్గొన్న వారు టీవీలో కనిపించడం, ఆ నిమిషానికి పలువురి మెప్పూ పొందడం, వాళ్లు ప్రకటించిన భారీ బహుమతులు అందుకోవడం ఇవన్నీ తక్షణమే లభించే ఫలితాలు. సంగీతాన్ని సాధన చేసి ఒకో మెట్టూ పైకెదగడం అనేది దీర్ఘకాలం సాగే ప్రక్రియ. దానివల్ల పైనచెప్పినట్టు హృదయ వైశాల్యం పెరిగి మనిషి దైవస్వరూపుడిగా మారతాడు.

ఈ విషయాన్ని గురువులు చిన్నారులకు తెలియజెప్పాలి. ఎల్కేజీలో చేరే పిల్లాడికి 'బాగా చదువుకోరా, నువ్వు పెద్ద సైంటిస్టువు అవుతావు' అంటే అర్థం కాదు. బడిలో చాక్లెట్లు బిస్కెట్లు పంచుతారు, కొత్త నేస్తాలొస్తారు అంటే వాడు స్కూలుకొస్తాడు. టీవీ కార్యక్రమాల పాత్ర అంతవరకే. వాటివల్ల యువతరంలో సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతోంది. దాన్ని పెంచి పోషించి సంగీత ప్రాముఖ్యతను వారికర్థమయ్యేలా ప్రోత్సహించవలసింది గురువులే.

మీకు రావలసినంత గుర్తింపు రాలేదనే బాధ ఉందా?
'రానిది రాదు, పోనిది పోదు... అడిగి సుఖములెవరనుభవించితిరా రామా?' అంటారు త్యాగరాజస్వామి. నాదీ అదే పద్ధతి. సంతృప్తి ఉన్నప్పుడే మనిషి ఆనందంగా జీవించగలడు. నాకన్నా నా కుమారుడు, శిష్యులు పత్రి సతీశ్ కుమార్, బీవీఎస్ భాస్కర్, సద్గురు చరణ్ వంటివారు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు, అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. అది నాకెంతో సంతృప్తినిచ్చే విషయం.

నా గురువులు శ్రీపాద సన్యాసిరావు, ముళ్లపూడి లక్ష్మణరావు వంటివారు డబ్బు ఆశించి నాకు విద్య నేర్పలేదు. ఒక కొడుకులా చూసుకుని ఏ వేళప్పుడు ఏ సందేహం అడిగినా తీర్చేవారు. నేనూ నా విద్యార్థులకు అలా మెలుగుతున్నానా, అంత గొప్ప గురుకుల సంప్రదాయానికి దివిటీనై నిలబడ్డానా లేదా అన్నదే నాకు ప్రధానం. ఇప్పుడీ 'కళారత్న' వచ్చింది, సంతోషమే. ఏవో కేంద్ర అవార్డులు రాలేదే అని బాధపడను.

ఆత్మీయత అర్థమయింది...
"చాలా ఏళ్ల క్రితం మృదంగం నేర్చుకుంటానంటూ బిల్ అనే ఒక పద్దెనిమిదేళ్ల అమెరికన్ యువతి మా ఇంటికొచ్చింది. వచ్చినప్పుడు చిన్న నిక్కరు, టీషర్టు వేసుకుంది. ఆమెను చూడటానికి చుట్టుపక్కల జనం పోగయ్యారు. ఆమెను లోపలికి పిలిచి మా ఆవిడకు అప్పజెప్పి చీరకట్టి తీసుకురమ్మన్నా.

తర్వాత వారమే మా అమ్మాయి పెళ్లి జరిగి ఆమె అత్తవారింటికి వెళుతున్నప్పుడు మేం ఏడవడం చూసి బిల్ ఒకటే నవ్వు. 'ఆ అమ్మాయి హాయిగా పెళ్లి చేసుకుని వెళుతుంటే మీ ఏడుపేంట'ని అడిగింది. 'ఆత్మీయత' అని చెపితే ఇంకా పెద్దగా నవ్వింది. ఆర్నెల్ల పాటు మృదంగం నేర్చుకుని స్వదేశానికి వెళ్లిపోయే సమయం వచ్చినప్పుడు బిల్ ఒకటే ఏడుపు.

'హాయిగా సొంతదేశానికి, అమ్మానాన్నల దగ్గరకు వెళుతున్నావుగా, ఏడుపెందుకూ' అని మేమడిగాం. 'ఈ ఆర్నెల్లలో భారతీయ సంగీతం నాకు ఆత్మీయతను, మమకారాన్నీ పంచింది. అంతకుముందు అవేమీ తెలియవు...' అంటూ కళ్లు తుడుచుకుంది. ఇప్పటికీ ఆమె నిండైన చీరకట్టులో వచ్చి పలకరిస్తుంది. మృదంగాన్ని అద్భుతంగా పలికిస్తుంది

Sunday, March 25, 2012

గిరి ‘ రాజ పుత్రుడు’


అరణ్యంలో పుట్టి హస్తినాపురం వరకు ఎదిగారు. ఆడంబరాలకు దూరంగా అడవిబిడ్డల్లో ఒకరిగా బతుకుతున్నారు. కిశోర్‌చంద్రదేవ్ కురుపాం రాజుగారి కొడుకే కావచ్చు. కానీ సామాన్యమైన రైతు జీవితాన్నే ఇష్టపడతారు. ఆయన మేడిబట్టారు. దుక్కి దున్నారు. మొక్క నాటారు. రాజనాలు పండించారు. రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఈ రోజు కిశోర్‌చంద్రదేవ్ కో అంటే ఉత్తరాంధ్ర కొండలు ఓ అని పలుకుతాయి. అరకులోయ ఎంపీ, కేంద్ర పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమశాఖల మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్‌కు క్రమశిక్షణ, రుజువర్తన, సేవాతత్పరత సహజాభరణాలు. విజయనగరం జిల్లా కురుపాం కోటలో కూర్చుని తన మనో భావాలను డాక్టర్ చింతకింది శ్రీనివాసరావుతో పంచుకున్నారు. ఆ సంభాషణ సారం ఆయన మాటల్లోనే...

కోటలోని చిన్నవాడికి పెద్దకష్టం...


దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరమే పుట్టాన్నేను. మా తండ్రి వైరిచర్ల దుర్గాప్రసాద్ వీరభద్రదేవ్. రాజా ఆఫ్ కురుపాం. మా ఫ్యామిలీకి రాజకీయనేపథ్యం ఉంది. నాన్న, చిన్నాన్న శాసనసభ్యులుగా పనిచేశారు. ప్రతిరోజూ మా కోటలోకి జనం తండోపతండాలుగా వస్తుండేవారు. అయితే నాకు అయిదేళ్ల వయసులో నాన్న హఠాత్తుగా కన్నుమూశారు. అంతకు ముందురోజు రాత్రి ఆయన్ని రాష్ట్రమంత్రిగా ప్రమాణం చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి మద్రాసు రమ్మని పిలిచారు. హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ఆ రాత్రి అనారోగ్యానికి సంబంధించి ఏదో ఇంజెక్షన్ తీసుకున్నారు. అది రియాక్షనిచ్చి ఉన్నట్టుండి కన్నుమూశారు. తెల్లారితే అమాత్యులుగా వెలుగొందవలసిన వారు రుద్రభూమికి ప్రయాణం కావడం ఎంతటి విధి వైపరీత్యమో చూడండి!


ఈతలో మేటి... గురిలో సూటి...


ఆ సమయంలో అమ్మ (శోభలతాదేవి) ధీర వనితలా నిలిచింది. కుటుంబాన్ని ఒక రూపానికి తెచ్చేందుకు నడుం బిగించింది. మేం అయిదుగురం పిల్లలం. ఇంట్లో నేనే మగ నలుసుని. నలుగురు అక్కాచెల్లెళ్ల మధ్య పెరిగాను. మేం గిరిజనులం. కొండదొరలం. విశాలమైన కోటలో ఉండేవాళ్లం. అఆఇఈలు కోటలోనే నేర్చాను. అమ్మగారొకరు ఇంటికొచ్చి పాఠం చెబుతుండేవారు.

మద్రాసులోని ఓ క్రిస్టియన్ స్కూల్లో ఫస్ట్‌ఫారం నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకూ చదివాను. వివేకానంద కాలేజీలో పీయూసీ పూర్తిచేశాను. హైస్కూల్లో చదువుతున్నప్పుడే ఈత మీద ఆసక్తి పెరిగింది. స్కూల్ స్విమ్మింగ్ జట్టుకు కెప్టెన్ అయ్యాను.


కళాశాలకు వెళ్లేసరికి ఈత స్థానంలో రైఫిల్ షూటింగ్ వచ్చి చేరింది. పాయింట్ టూటూ రైఫిల్ పేల్చడంలో గురితప్పేవాణ్ణేకాను. ఎన్‌సీసీ స్టూడెంట్‌గా 315 తుపాకీకాల్చేవాణ్ణి. ఫైరింగ్‌లో రెండుసార్లు సౌతిండియన్ ఛాంపియన్‌షిప్ గెల్చుకున్నాను. నేషనల్ ఛాంపియన్ కావాల్సి ఉంది. నా బియ్యే ఫైనల్ ఎగ్జామ్స్, రెండు పోటీలూ ఒకేసారి పడిపోవడంతో వీల్లేకపోయింది.


తొలినుంచీ ఈత, షూటింగ్, బిలియర్డ్స్, చెస్ ఇలా వీటన్నింటిలోనూ బిజీకావడంవల్లేనేమో చదువులో మరీ అద్భుతంగా ఫలితాలు రాలేదు. అలా అని నా ఫస్ట్‌క్లాసుకెప్పుడూ ఢోకా లేదు. హిందూ’ మాజీ సంపాదకుడు ఎన్.రామ్, పూర్వమంత్రి కుమారమంగళం నా స్కూల్ మేట్లు. ఇప్పటి కేంద్రమంత్రి చిదంబరం నాకు రెండేళ్ల సీనియర్.

http://netindian.in/sites/default/files/20110712min14.jpg
రైతు జీవితం నుంచి రాజకీయాల్లోకి...

1971లో నాకు వివాహమైంది. ప్రీతీదేవి జీవన సహచరి అయింది. ఆ మరుసటి సంవత్సరం నేను చెన్నై నుంచి కురుపాం వచ్చేశాను. మాకున్న భూమీ పుట్రా అన్నీ దగ్గరుండి చూసుకోవడం ప్రారంభించాను. వ్యవసాయమంటే చాలా ఇష్టం. ఆరేడేళ్లపాటు కర్షకునిగా చెమటోడ్చి పనిచేశాను. మాది పల్లంభూమి గనుక వరి పండించేవాణ్ణి. తొలి ఏడాదే ఎకరానికి డెబ్భయిరెండు బస్తాల దిగుబడితో రికార్డుసృష్టించాను. ఐఈటీ రకం వంగడాల సాయంతో ఈ ఫలితం సాధించాను. ప్రభుత్వం నాకు ఉత్తమరైతు పురస్కారమిచ్చింది.


ఇలా కురుపాంలో కర్షకునిగా కాలం గడుపుతున్న నాకు 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నుంచి పిలుపువచ్చింది. పెద్దాయన ఎందుకు పిలిచారోననుకుంటూ హైదరాబాద్ వెళ్లాను. మా చిన్నాన్న వైరిచర్ల చంద్రచూడామణీదేవ్ నాగూరు శాసనసభాస్థానానికి ప్రాతినిధ్యం వహించేవారు. కూడా ఆయన ఉన్నారు. యువకులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని జలగం హితబోధ చేశారు. అప్పటికి ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాలిటిక్స్‌లో చేరడం సమంజసమా అనే ఆలోచనలో పడ్డాను. అలాంటిదేం లేదనీ, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తాననీ, నీడగా ఉంటాననీ మాటిచ్చారు. రెండు మూడుసార్లు చర్చలు జరిగాక, కాంగ్రెస్‌లో చేరాను.
http://www.sarkaritel.com/uploads/images/4ee72050e5e55kishore-chandra-deo.jpg
చిన్నవయసు మంత్రి...

1977 ఎన్నికల్లో తొలిసారిగా పార్వతీపురం ఎస్టీ రిజర్వుడ్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేశాను. కాళ్లకు బలపాలు కట్టుకుని నియోజకవర్గమంతా తిరిగాను. జనం నన్ను గౌరవించి గెలిపించారు. ఢిల్లీ పంపించారు. ఆ తర్వాత కాలంలో కేంద్రంలో జనతాప్రభుత్వం ఏర్పడటం ఆ ప్రయోగం కాస్తా విఫలం కావడం అందరికీ తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లోనూ పెనుమార్పులొచ్చాయి. కాంగ్రెస్ కాకుండా రెడ్డి కాంగ్రెస్ రంగంలోకి వచ్చింది. మేమంతా దాని పక్షానే ఉన్నాం. దేవరాజ్ అర్స్, స్వరణ్‌సింగ్, బ్రహ్మానందరెడ్డి ఇలా నాయకుల పేర్లతో ఆ పార్టీ చలామణీ అవుతుండేది. ఇది సరైన పద్ధతి కాదని ఆ పార్టీకి కాంగ్రెస్ (ఎస్) అంటే సోషలిస్టు అనే నామాన్ని స్థిరపరిచాం. ఈ లోగా కేంద్రంలో జనతాపార్టీ చీలిపోయింది. 1979లో రైతు నాయకుడు చరణ్‌సింగ్ ఆధ్వర్యాన ప్రభుత్వం ఏర్పాటయింది. మేమంతా చాలాపార్టీలు పలికినట్టే ఆయనకు మద్దతు పలికాం. చరణ్‌సింగ్ నన్ను చాలా ఇష్టపడేవారు. క్యాబినెట్‌లో సహాయమంత్రిగా చేర్చుకున్నారు. నాకప్పుడు ముప్ఫయి రెండేళ్లు. మంత్రివర్గంలో పిన్నవయస్కుణ్ణి నేనే.

రాజీనామా..!

‘మినిస్టర్ ఫర్ స్టేట్’గా ప్రమాణం చేశాక మా తొలినాళ్ల ఇబ్బందుల గురించి చెప్పాలి. బాధ్యతలు చేపట్టి నెలరోజులయినా నా దగ్గరకు ఒక్కటంటే ఒక్క ఫైలూ లేదు. పీఎమ్ సయీద్ (బొగ్గు, గనుల శాఖ మరో సహాయమంత్రి.) పరిస్థితీ అంతే. తనూ నేను ఢిల్లీలోని శాస్త్రీభవన్‌లో గోళ్లు గిల్లుకునేవాళ్లం. పని లేనప్పుడు ఈ మంత్రిపదవులెందుకు? ఈ విషయాన్ని ‘ఉక్కు, బొగ్గు, గనుల శాఖ’ మంత్రి బిజూ పట్నాయక్‌కు చెప్పొచ్చు. కానీ ఆయన మా పార్టీ వాడు కాదు. ఎలా స్పందిస్తారో! అందుకే మా కాంగ్రెస్(ఎస్)కి చెందిన ఉప ప్రధానమంత్రి వై.బి.చవాన్ దగ్గరకి వెళ్తే, చరణ్‌సింగ్‌కే అన్ని విషయాలూ చెప్పండని సలహా ఇచ్చారు.

ఆ మాట ప్రకారం వన్‌ఫైన్ మార్నింగ్ ఏడింటికే ప్రధాని నివాసానికి నేను, సయీద్ చేరుకున్నాం. ఇంత ఉదయాన్నే వచ్చారేంటంటూ మమ్మల్ని పలకరించారు. జేబులోంచి మడతలు పెట్టిన తెల్లకాగితం బయటకు తీశాను. ఇది నా రాజీనామా లేఖ అన్నాను. నిజానికది వైట్ పేపరే. దానిమీద ఏం రాయలేదు. ప్రధానికి సీరియస్‌నెస్ తెలియాలని అలా చేశాను. వెనకనున్న సయీద్ గోలపెట్టాడు. పెద్దాయన రాజీనామా చేసేయమంటే గోవిందా అయిపోతామంటూ తమిళంలో గొణిగాడు. సయీద్ చెబుతున్నదేంటో అర్థంకాని చరణ్ సింగ్ ‘ క్యా బోల్తా హై’ అన్నారు. నాబాధే తన బాధ అంటున్నాడంటూ మేనేజ్ చేశాను. ‘మొన్నమొన్న మంత్రులయ్యారు, అప్పుడే రాజీనామా ఏంటి’ అన్నారాయన. ‘నెలరోజులయినా ఇప్పటికీ ఒక్క ఫైలు మొహమూ చూసిందే లే’దన్నాను. ‘మరి బిజూ ఏం చేస్తున్నాడట’ అన్నారాయన కొంచెం కోపంగా. పోర్టుఫోలియోల వ్యవహారమంతా చూసిన పీఎస్‌ను రమ్మనమన్నారు. ఈలోగా బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేయించారు.
http://exposeindialive.com/eil/wp-content/uploads/2011/07/s2011071435699.jpg
బొగ్గు మంత్రి... స్టీలు ప్లాంటు...

మళ్లీ మేము ఆఫీస్‌కి వెళ్లేసరికి ప్రధానమంత్రి సంతకం చేసిన ఆర్డర్ కాపీలు రెడీగా ఉన్నాయి. బొగ్గు ఫైళ్లు నాకు, గనుల ఫైళ్లు సయీద్ వద్దకు వెళ్లాలని స్పష్టంగా రాశారు. సంగతి తెలుసుకున్న బిజూ ఆ సాయంత్రం టీకి పిలిచారు. అసలే కోపధారి మనిషి. ఏమంటాడో అనుకున్నాం. వెళ్లేసరికి ఆయన మాకోసం స్వీట్లు, హాట్లు సిద్ధం చేశారు. ‘ఏమయ్యా ఏదైనా ఇబ్బంది ఉంటే నాకే చెప్పొచ్చుకదా! సరాసరి ప్రధాని దగ్గరికే పోవాలా?’ అన్నారు చిరుకోపంతో. ‘పోనీలెండి. అదీ మన మంచికే. మీ పనులేంటో మీకు నిర్ధారణ అయ్యాయి. కష్టపడండి. ఏ నిర్ణయాలైనా తీసుకోండి. అభ్యంతరం లేదు. ఆ సమాచారం మాత్రం చేరవేస్తే చాలు. మనమధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు’ అని దీవించినట్టుగా చెప్పారు. బొగ్గు మంత్రినైనా విశాఖపట్నానికి దగ్గరివాణ్ని కాబట్టి, వైజాగ్ స్టీల్‌ప్లాంటు పనులు నేనే చూస్తానని కోరాను. బిజూ అంగీకరించారు.


నా హయాంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు లెవలింగ్ వర్క్ మొదలైంది. ఆ పనులకు నలభెరైండు కోట్లరూపాయల నిధులు మంజూరు చేశాను. చరిత్రాత్మకమైన బొగ్గుగని కార్మికుల, ఉద్యోగుల వేతన ఒప్పందాన్ని స్వయంగా ఖరారు చేశాను. ఈ విషయంలో బ్యూరోక్రాట్లు నాకు కలిసి రాని పరిస్థితుల్లో బిజూ కలుగజేసుకునేవారు. మంత్రుల విధుల్లోకి ఐఏఎస్‌లు చొరబడితే సహించేది లేదని కరాఖండీగా చెప్పేవారు. అలాంటి వారినుంచీ ఎంతో నేర్చుకోవచ్చు. ఇప్పటికీ నేను ప్రతీ ఫైలు చదివితేనేగానీ సంతకం చేయను. మార్చాలనుకుంటే స్వయంగా నా చేతిరాతతో మారుస్తాను.


కాంగ్రెస్(ఎస్) నుంచి కాంగ్రెస్‌లోకి...


దాదాపు ఆరునెలల పాటు పనిచేశాక చరణ్‌సింగ్ ప్రధానిగా గద్దె దిగారు. మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 1980లో జరిగిన ఆ ఎన్నికల్లో నేను పార్వతీపురం నుంచి కాంగ్రెస్(ఎస్) తరఫున పోటీ చేసి గెలుపొందాను. రాష్ట్రంలోని మొత్తం నలభెరైండు లోక్‌సభ స్థానాల్లో నలభైయ్యొక్కటీ కాంగ్రెస్సే గెలిచింది. ఒక్కటి మాత్రం నే గెలిచాను.


1992లో ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనేస్వయంగా పిలిపించారు. మతశక్తులతో పోరాటం చేయాల్సిన అవసరం ఉందిగనుక మనమందరం కలిసి నడవాలని సూచించారు. ఆ మాట మేరకు ఇందిరా కాంగ్రెస్‌లో చేరాను. 1994 నుంచి 2000 వరకూ రాజ్యసభ సభ్యునిగా ఉన్నాను. పబ్లిక్ అండర్ టేకింగ్స్, ప్రివిలెజైస్, ఎమ్‌పీ ల్యాడ్స్ తదితర పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్‌గా పనిచేశాను. ఎంపీల మిస్‌కాండక్టు విషయమై విచారణ జరిపిన కమిటీకి, ఎంపీల నిధుల ఖర్చువిషయమై ఏర్పడిన కమిటీకి అధ్యక్షుడిగా చేశాను. వీటన్నింటికంటే ముఖ్యంగా అటవీ హక్కుల గుర్తింపు విషయంలో ఏర్పాటయిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించాను. నా తోటి గిరిజనులకు సేవ చేసే అవకాశం కలిగింది. అదృష్టవశాత్తూ ఆ సిఫార్సులు అమలు చేసేందుకు వీలయిన గిరిజన సంక్షేమశాఖ ఇప్పుడు కేంద్రమంత్రిగా నా చేతుల్లోనే ఉంది. ఇందువల్ల మరింత ప్రగతి సాధించవచ్చనిపిస్తోంది.


నో మనీ... నో లిక్కర్...


ముప్ఫయ్యేళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ఇప్పటివరకూ ఎనిమిదిసార్లు పార్లమెంటుకు పోటీచేసి అయిదుసార్లు నెగ్గాను, మూడు సార్లు ఓడాను. ఏ ఎన్నికల్లోనూ వోటర్లకు మద్యం పంచలేదు. డబ్బు ఎరవేయలేదు. మందు, సొమ్ము కుమ్మరిస్తేనే గానీ గెలవలేం అనడం సరికాదు. ఓటర్లకు మంచేదో చెడ్డేదో తెలుసు. తడలో ఉన్న ఓటరూ ఇచ్ఛాపురంలో ఉన్న వోటరూ కూడా ఒకేలా ఆలోచిస్తారు. అందుకే ప్రజాస్వామ్యంలో వారంతా అజేయులు.


వచ్చే పదేళ్లలో నేను ఏ పొజిషన్‌లో ఉంటాను, ఎలా ఉంటాను... అనే ఆలోచనలు ఎప్పుడూ చెయ్యను. జీవితం ముందుకు సాగే క్రమంలో అది ఏ బాధ్యత కట్టబెడితే అది నిర్వహించవలసిందే. నేనొక్కటే అనుకుంటాను, తోటి మనిషికి కాస్తయినా సహాయం చేసేలా గడపగలిగితే అదే చాలు, మన పదవులు అందుకు వినియోగిస్తే చాలు.


బయోడేటా


పూర్తి పేరు: వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్

పుట్టిన రోజు: 1947 ఫిబ్రవరి 15

జన్మస్థలం: కురుపాం కోట (విజయనగరం జిల్లా)
విద్యార్హత: ఎమ్‌ఏ(పొలిటికల్ సైన్స్)
తల్లిదండ్రులు: శోభలతాదేవి, రాజా వైరిచర్ల దుర్గాప్రసాద్ వీరభద్రదేవ్
కుటుంబం: కిశోర్ సతీమణి ప్రీతీదేవి ఒరిస్సాకు చెందిన దసపల్లా రాజకుటుంబ మహిళ. కుమారుడు శిశిర్‌దేవ్ ఇన్స్యూరెన్స్ రంగంలో ఉన్నతోద్యోగం చేస్తున్నారు. కుమార్తె శ్రుతీదేవి ఆడ్వకేట్. గిరిజనమహిళల సంక్షేమం కోసం ప్రభుత్వేతర సంస్థల సాయంతో పనిచేస్తున్నారు.


1977లో తొలిసారిగా పార్వతీపురం లోక్‌సభస్థానం నుంచి ఎన్నికయ్యారు. 1980, 1985, 2004 సంవత్సరాల్లో ఇదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు.


1979లో చరణ్‌సింగ్ క్యాబినెట్‌లో బొగ్గుశాఖ సహాయమంత్రిగా పనిచేశారు.

2009లో కొత్తగా ఏర్పడ్డ అరకులోయ స్థానం నుంచి లోక్‌సభకు గెలిచారు.
ఐక్యరాజ్యసమితి సమావేశానికి భారత ప్రతినిధిగా వెళ్లారు. కెన్యా, స్విట్జర్లాండ్, బ్రిటన్, బల్గేరియా, పెరులాంటి దేశాల్లో పార్లమెంటరీ వ్యవహారాల పరిశీలన కోసం పర్యటించారు.
ప్రస్తుతం 2010 జూన్ నుంచీ మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో కేంద్ర గిరిజన సంక్షేమం, పంచాయితీరాజ్ శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.

‘ఛేంజింగ్ ఇండియాస్ పొలిటికల్ మౌల్డ్’ పుస్తకం రాశారు.

నో సినిమా... నో సెక్యూరిటీ...


సినిమాల విషయంలో కిశోర్ చంద్రదేవ్ వెరీ పూర్. కురుపాంలో ఆయన కుటుంబానికి ఒక థియేటర్ ఉండేది. దాన్లో చిన్నప్పుడెప్పుడో పాతాళభైరవి, మాయాబజార్ చూశారట. తర్వాత చూడనే లేదట. ‘సినిమాలకు సంబంధించిన జ్ఞానంలో నేను పూర్తిగా వెనుకబడినవాణ్ణి’ అంటారాయన. కురుపాంలోని ఆ టాకీస్‌ను కూడా అమ్మేశారు.

‘ఖాళీ దొరికితే పుస్తకాలు చదువుతాను. ఇంకొంచెం ఖాళీ దొరికితే సంగీతం వింటా’నంటారు కిశోర్. బాలమురళీ, ఘంటసాల, మహమ్మద్ రఫీ ఆయన అభిమానించే గాయకులు.


మాంసాహారాన్ని ఇష్టపడతారు. అలా అని అది తప్పనిసరిగా ఉండాలని కాదు, ఏదుంటే అది తింటానంటారు.


దేవుడంటే నమ్మకం ఉంది. పూజలు చేస్తారు.


ల్యాండ్ సీలింగ్ కింద కుటుంబానికి చెందిన మూడువేల ఎకరాల పొలాన్ని స్వచ్ఛందంగా సర్కారువారికి అప్పగించారు.


తన దగ్గరకు వచ్చినవారి సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారు. బాధలు చెప్పుకోవడానికి వచ్చేవారిలో చాలా మంది పేదవారే. అలాంటివారికి ఆయనే దారిఖర్చులిచ్చి మరీ ఊళ్లకి పంపిస్తారు.


కేంద్రమంత్రికి ఉండాల్సిన సెక్యూరిటీ బృందాలు చంద్రదేవ్ దగ్గర మచ్చుకైనా కనిపించవు. అడవుల్లో ప్రయాణించినా, సెక్యూరిటీ వద్దంటారు. ప్రజలే రక్షకులని నమ్ముతారు. ‘ఈ వేళా రేపూ సెక్యూరిటీ అనేది స్టేటస్ సింబల్ అయిపోయింది. పెద్దపెద్ద గన్‌లు, గన్‌మేన్ల హడావుడి నాకంతగా నచ్చదు. అవసరమనుకున్నప్పుడు నేనే పిలుస్తానని చెప్పి వారిని పంపేస్తాను. వాళ్లు నాకు బదులుగా మరొకరికి భద్రత కల్పించవచ్చు కదా’ అంటారు.