కోటలోని చిన్నవాడికి పెద్దకష్టం...
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరమే పుట్టాన్నేను. మా తండ్రి వైరిచర్ల దుర్గాప్రసాద్ వీరభద్రదేవ్. రాజా ఆఫ్ కురుపాం. మా ఫ్యామిలీకి రాజకీయనేపథ్యం ఉంది. నాన్న, చిన్నాన్న శాసనసభ్యులుగా పనిచేశారు. ప్రతిరోజూ మా కోటలోకి జనం తండోపతండాలుగా వస్తుండేవారు. అయితే నాకు అయిదేళ్ల వయసులో నాన్న హఠాత్తుగా కన్నుమూశారు. అంతకు ముందురోజు రాత్రి ఆయన్ని రాష్ట్రమంత్రిగా ప్రమాణం చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి మద్రాసు రమ్మని పిలిచారు. హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ఆ రాత్రి అనారోగ్యానికి సంబంధించి ఏదో ఇంజెక్షన్ తీసుకున్నారు. అది రియాక్షనిచ్చి ఉన్నట్టుండి కన్నుమూశారు. తెల్లారితే అమాత్యులుగా వెలుగొందవలసిన వారు రుద్రభూమికి ప్రయాణం కావడం ఎంతటి విధి వైపరీత్యమో చూడండి!
ఈతలో మేటి... గురిలో సూటి...
ఆ సమయంలో అమ్మ (శోభలతాదేవి) ధీర వనితలా నిలిచింది. కుటుంబాన్ని ఒక రూపానికి తెచ్చేందుకు నడుం బిగించింది. మేం అయిదుగురం పిల్లలం. ఇంట్లో నేనే మగ నలుసుని. నలుగురు అక్కాచెల్లెళ్ల మధ్య పెరిగాను. మేం గిరిజనులం. కొండదొరలం. విశాలమైన కోటలో ఉండేవాళ్లం. అఆఇఈలు కోటలోనే నేర్చాను. అమ్మగారొకరు ఇంటికొచ్చి పాఠం చెబుతుండేవారు.
మద్రాసులోని ఓ క్రిస్టియన్ స్కూల్లో ఫస్ట్‌ఫారం నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకూ చదివాను. వివేకానంద కాలేజీలో పీయూసీ పూర్తిచేశాను. హైస్కూల్లో చదువుతున్నప్పుడే ఈత మీద ఆసక్తి పెరిగింది. స్కూల్ స్విమ్మింగ్ జట్టుకు కెప్టెన్ అయ్యాను.
కళాశాలకు వెళ్లేసరికి ఈత స్థానంలో రైఫిల్ షూటింగ్ వచ్చి చేరింది. పాయింట్ టూటూ రైఫిల్ పేల్చడంలో గురితప్పేవాణ్ణేకాను. ఎన్‌సీసీ స్టూడెంట్‌గా 315 తుపాకీకాల్చేవాణ్ణి. ఫైరింగ్‌లో రెండుసార్లు సౌతిండియన్ ఛాంపియన్‌షిప్ గెల్చుకున్నాను. నేషనల్ ఛాంపియన్ కావాల్సి ఉంది. నా బియ్యే ఫైనల్ ఎగ్జామ్స్, రెండు పోటీలూ ఒకేసారి పడిపోవడంతో వీల్లేకపోయింది.
తొలినుంచీ ఈత, షూటింగ్, బిలియర్డ్స్, చెస్ ఇలా వీటన్నింటిలోనూ బిజీకావడంవల్లేనేమో చదువులో మరీ అద్భుతంగా ఫలితాలు రాలేదు. అలా అని నా ఫస్ట్‌క్లాసుకెప్పుడూ ఢోకా లేదు. హిందూ’ మాజీ సంపాదకుడు ఎన్.రామ్, పూర్వమంత్రి కుమారమంగళం నా స్కూల్ మేట్లు. ఇప్పటి కేంద్రమంత్రి చిదంబరం నాకు రెండేళ్ల సీనియర్.
రైతు జీవితం నుంచి రాజకీయాల్లోకి...
1971లో నాకు వివాహమైంది. ప్రీతీదేవి జీవన సహచరి అయింది. ఆ మరుసటి సంవత్సరం నేను చెన్నై నుంచి కురుపాం వచ్చేశాను. మాకున్న భూమీ పుట్రా అన్నీ దగ్గరుండి చూసుకోవడం ప్రారంభించాను. వ్యవసాయమంటే చాలా ఇష్టం. ఆరేడేళ్లపాటు కర్షకునిగా చెమటోడ్చి పనిచేశాను. మాది పల్లంభూమి గనుక వరి పండించేవాణ్ణి. తొలి ఏడాదే ఎకరానికి డెబ్భయిరెండు బస్తాల దిగుబడితో రికార్డుసృష్టించాను. ఐఈటీ రకం వంగడాల సాయంతో ఈ ఫలితం సాధించాను. ప్రభుత్వం నాకు ఉత్తమరైతు పురస్కారమిచ్చింది.
ఇలా కురుపాంలో కర్షకునిగా కాలం గడుపుతున్న నాకు 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నుంచి పిలుపువచ్చింది. పెద్దాయన ఎందుకు పిలిచారోననుకుంటూ హైదరాబాద్ వెళ్లాను. మా చిన్నాన్న వైరిచర్ల చంద్రచూడామణీదేవ్ నాగూరు శాసనసభాస్థానానికి ప్రాతినిధ్యం వహించేవారు. కూడా ఆయన ఉన్నారు. యువకులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని జలగం హితబోధ చేశారు. అప్పటికి ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాలిటిక్స్‌లో చేరడం సమంజసమా అనే ఆలోచనలో పడ్డాను. అలాంటిదేం లేదనీ, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తాననీ, నీడగా ఉంటాననీ మాటిచ్చారు. రెండు మూడుసార్లు చర్చలు జరిగాక, కాంగ్రెస్‌లో చేరాను.
చిన్నవయసు మంత్రి...
1977 ఎన్నికల్లో తొలిసారిగా పార్వతీపురం ఎస్టీ రిజర్వుడ్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేశాను. కాళ్లకు బలపాలు కట్టుకుని నియోజకవర్గమంతా తిరిగాను. జనం నన్ను గౌరవించి గెలిపించారు. ఢిల్లీ పంపించారు. ఆ తర్వాత కాలంలో కేంద్రంలో జనతాప్రభుత్వం ఏర్పడటం ఆ ప్రయోగం కాస్తా విఫలం కావడం అందరికీ తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లోనూ పెనుమార్పులొచ్చాయి. కాంగ్రెస్ కాకుండా రెడ్డి కాంగ్రెస్ రంగంలోకి వచ్చింది. మేమంతా దాని పక్షానే ఉన్నాం. దేవరాజ్ అర్స్, స్వరణ్‌సింగ్, బ్రహ్మానందరెడ్డి ఇలా నాయకుల పేర్లతో ఆ పార్టీ చలామణీ అవుతుండేది. ఇది సరైన పద్ధతి కాదని ఆ పార్టీకి కాంగ్రెస్ (ఎస్) అంటే సోషలిస్టు అనే నామాన్ని స్థిరపరిచాం. ఈ లోగా కేంద్రంలో జనతాపార్టీ చీలిపోయింది. 1979లో రైతు నాయకుడు చరణ్‌సింగ్ ఆధ్వర్యాన ప్రభుత్వం ఏర్పాటయింది. మేమంతా చాలాపార్టీలు పలికినట్టే ఆయనకు మద్దతు పలికాం. చరణ్‌సింగ్ నన్ను చాలా ఇష్టపడేవారు. క్యాబినెట్‌లో సహాయమంత్రిగా చేర్చుకున్నారు. నాకప్పుడు ముప్ఫయి రెండేళ్లు. మంత్రివర్గంలో పిన్నవయస్కుణ్ణి నేనే.
రాజీనామా..!
‘మినిస్టర్ ఫర్ స్టేట్’గా ప్రమాణం చేశాక మా తొలినాళ్ల ఇబ్బందుల గురించి చెప్పాలి. బాధ్యతలు చేపట్టి నెలరోజులయినా నా దగ్గరకు ఒక్కటంటే ఒక్క ఫైలూ లేదు. పీఎమ్ సయీద్ (బొగ్గు, గనుల శాఖ మరో సహాయమంత్రి.) పరిస్థితీ అంతే. తనూ నేను ఢిల్లీలోని శాస్త్రీభవన్‌లో గోళ్లు గిల్లుకునేవాళ్లం. పని లేనప్పుడు ఈ మంత్రిపదవులెందుకు? ఈ విషయాన్ని ‘ఉక్కు, బొగ్గు, గనుల శాఖ’ మంత్రి బిజూ పట్నాయక్‌కు చెప్పొచ్చు. కానీ ఆయన మా పార్టీ వాడు కాదు. ఎలా స్పందిస్తారో! అందుకే మా కాంగ్రెస్(ఎస్)కి చెందిన ఉప ప్రధానమంత్రి వై.బి.చవాన్ దగ్గరకి వెళ్తే, చరణ్‌సింగ్‌కే అన్ని విషయాలూ చెప్పండని సలహా ఇచ్చారు.
ఆ మాట ప్రకారం వన్‌ఫైన్ మార్నింగ్ ఏడింటికే ప్రధాని నివాసానికి నేను, సయీద్ చేరుకున్నాం. ఇంత ఉదయాన్నే వచ్చారేంటంటూ మమ్మల్ని పలకరించారు. జేబులోంచి మడతలు పెట్టిన తెల్లకాగితం బయటకు తీశాను. ఇది నా రాజీనామా లేఖ అన్నాను. నిజానికది వైట్ పేపరే. దానిమీద ఏం రాయలేదు. ప్రధానికి సీరియస్‌నెస్ తెలియాలని అలా చేశాను. వెనకనున్న సయీద్ గోలపెట్టాడు. పెద్దాయన రాజీనామా చేసేయమంటే గోవిందా అయిపోతామంటూ తమిళంలో గొణిగాడు. సయీద్ చెబుతున్నదేంటో అర్థంకాని చరణ్ సింగ్ ‘ క్యా బోల్తా హై’ అన్నారు. నాబాధే తన బాధ అంటున్నాడంటూ మేనేజ్ చేశాను. ‘మొన్నమొన్న మంత్రులయ్యారు, అప్పుడే రాజీనామా ఏంటి’ అన్నారాయన. ‘నెలరోజులయినా ఇప్పటికీ ఒక్క ఫైలు మొహమూ చూసిందే లే’దన్నాను. ‘మరి బిజూ ఏం చేస్తున్నాడట’ అన్నారాయన కొంచెం కోపంగా. పోర్టుఫోలియోల వ్యవహారమంతా చూసిన పీఎస్‌ను రమ్మనమన్నారు. ఈలోగా బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేయించారు.
బొగ్గు మంత్రి... స్టీలు ప్లాంటు...
మళ్లీ మేము ఆఫీస్‌కి వెళ్లేసరికి ప్రధానమంత్రి సంతకం చేసిన ఆర్డర్ కాపీలు రెడీగా ఉన్నాయి. బొగ్గు ఫైళ్లు నాకు, గనుల ఫైళ్లు సయీద్ వద్దకు వెళ్లాలని స్పష్టంగా రాశారు. సంగతి తెలుసుకున్న బిజూ ఆ సాయంత్రం టీకి పిలిచారు. అసలే కోపధారి మనిషి. ఏమంటాడో అనుకున్నాం. వెళ్లేసరికి ఆయన మాకోసం స్వీట్లు, హాట్లు సిద్ధం చేశారు. ‘ఏమయ్యా ఏదైనా ఇబ్బంది ఉంటే నాకే చెప్పొచ్చుకదా! సరాసరి ప్రధాని దగ్గరికే పోవాలా?’ అన్నారు చిరుకోపంతో. ‘పోనీలెండి. అదీ మన మంచికే. మీ పనులేంటో మీకు నిర్ధారణ అయ్యాయి. కష్టపడండి. ఏ నిర్ణయాలైనా తీసుకోండి. అభ్యంతరం లేదు. ఆ సమాచారం మాత్రం చేరవేస్తే చాలు. మనమధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు’ అని దీవించినట్టుగా చెప్పారు. బొగ్గు మంత్రినైనా విశాఖపట్నానికి దగ్గరివాణ్ని కాబట్టి, వైజాగ్ స్టీల్‌ప్లాంటు పనులు నేనే చూస్తానని కోరాను. బిజూ అంగీకరించారు.
నా హయాంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు లెవలింగ్ వర్క్ మొదలైంది. ఆ పనులకు నలభెరైండు కోట్లరూపాయల నిధులు మంజూరు చేశాను. చరిత్రాత్మకమైన బొగ్గుగని కార్మికుల, ఉద్యోగుల వేతన ఒప్పందాన్ని స్వయంగా ఖరారు చేశాను. ఈ విషయంలో బ్యూరోక్రాట్లు నాకు కలిసి రాని పరిస్థితుల్లో బిజూ కలుగజేసుకునేవారు. మంత్రుల విధుల్లోకి ఐఏఎస్‌లు చొరబడితే సహించేది లేదని కరాఖండీగా చెప్పేవారు. అలాంటి వారినుంచీ ఎంతో నేర్చుకోవచ్చు. ఇప్పటికీ నేను ప్రతీ ఫైలు చదివితేనేగానీ సంతకం చేయను. మార్చాలనుకుంటే స్వయంగా నా చేతిరాతతో మారుస్తాను.
కాంగ్రెస్(ఎస్) నుంచి కాంగ్రెస్‌లోకి...
దాదాపు ఆరునెలల పాటు పనిచేశాక చరణ్‌సింగ్ ప్రధానిగా గద్దె దిగారు. మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 1980లో జరిగిన ఆ ఎన్నికల్లో నేను పార్వతీపురం నుంచి కాంగ్రెస్(ఎస్) తరఫున పోటీ చేసి గెలుపొందాను. రాష్ట్రంలోని మొత్తం నలభెరైండు లోక్‌సభ స్థానాల్లో నలభైయ్యొక్కటీ కాంగ్రెస్సే గెలిచింది. ఒక్కటి మాత్రం నే గెలిచాను.
1992లో ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనేస్వయంగా పిలిపించారు. మతశక్తులతో పోరాటం చేయాల్సిన అవసరం ఉందిగనుక మనమందరం కలిసి నడవాలని సూచించారు. ఆ మాట మేరకు ఇందిరా కాంగ్రెస్‌లో చేరాను. 1994 నుంచి 2000 వరకూ రాజ్యసభ సభ్యునిగా ఉన్నాను. పబ్లిక్ అండర్ టేకింగ్స్, ప్రివిలెజైస్, ఎమ్‌పీ ల్యాడ్స్ తదితర పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్‌గా పనిచేశాను. ఎంపీల మిస్‌కాండక్టు విషయమై విచారణ జరిపిన కమిటీకి, ఎంపీల నిధుల ఖర్చువిషయమై ఏర్పడిన కమిటీకి అధ్యక్షుడిగా చేశాను. వీటన్నింటికంటే ముఖ్యంగా అటవీ హక్కుల గుర్తింపు విషయంలో ఏర్పాటయిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించాను. నా తోటి గిరిజనులకు సేవ చేసే అవకాశం కలిగింది. అదృష్టవశాత్తూ ఆ సిఫార్సులు అమలు చేసేందుకు వీలయిన గిరిజన సంక్షేమశాఖ ఇప్పుడు కేంద్రమంత్రిగా నా చేతుల్లోనే ఉంది. ఇందువల్ల మరింత ప్రగతి సాధించవచ్చనిపిస్తోంది.
నో మనీ... నో లిక్కర్...
ముప్ఫయ్యేళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ఇప్పటివరకూ ఎనిమిదిసార్లు పార్లమెంటుకు పోటీచేసి అయిదుసార్లు నెగ్గాను, మూడు సార్లు ఓడాను. ఏ ఎన్నికల్లోనూ వోటర్లకు మద్యం పంచలేదు. డబ్బు ఎరవేయలేదు. మందు, సొమ్ము కుమ్మరిస్తేనే గానీ గెలవలేం అనడం సరికాదు. ఓటర్లకు మంచేదో చెడ్డేదో తెలుసు. తడలో ఉన్న ఓటరూ ఇచ్ఛాపురంలో ఉన్న వోటరూ కూడా ఒకేలా ఆలోచిస్తారు. అందుకే ప్రజాస్వామ్యంలో వారంతా అజేయులు.
వచ్చే పదేళ్లలో నేను ఏ పొజిషన్‌లో ఉంటాను, ఎలా ఉంటాను... అనే ఆలోచనలు ఎప్పుడూ చెయ్యను. జీవితం ముందుకు సాగే క్రమంలో అది ఏ బాధ్యత కట్టబెడితే అది నిర్వహించవలసిందే. నేనొక్కటే అనుకుంటాను, తోటి మనిషికి కాస్తయినా సహాయం చేసేలా గడపగలిగితే అదే చాలు, మన పదవులు అందుకు వినియోగిస్తే చాలు.
బయోడేటా
పూర్తి పేరు: వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్
పుట్టిన రోజు: 1947 ఫిబ్రవరి 15
జన్మస్థలం: కురుపాం కోట (విజయనగరం జిల్లా)
విద్యార్హత: ఎమ్‌ఏ(పొలిటికల్ సైన్స్)
తల్లిదండ్రులు: శోభలతాదేవి, రాజా వైరిచర్ల దుర్గాప్రసాద్ వీరభద్రదేవ్
కుటుంబం: కిశోర్ సతీమణి ప్రీతీదేవి ఒరిస్సాకు చెందిన దసపల్లా రాజకుటుంబ మహిళ. కుమారుడు శిశిర్‌దేవ్ ఇన్స్యూరెన్స్ రంగంలో ఉన్నతోద్యోగం చేస్తున్నారు. కుమార్తె శ్రుతీదేవి ఆడ్వకేట్. గిరిజనమహిళల సంక్షేమం కోసం ప్రభుత్వేతర సంస్థల సాయంతో పనిచేస్తున్నారు.
1977లో తొలిసారిగా పార్వతీపురం లోక్‌సభస్థానం నుంచి ఎన్నికయ్యారు. 1980, 1985, 2004 సంవత్సరాల్లో ఇదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు.
1979లో చరణ్‌సింగ్ క్యాబినెట్‌లో బొగ్గుశాఖ సహాయమంత్రిగా పనిచేశారు.
2009లో కొత్తగా ఏర్పడ్డ అరకులోయ స్థానం నుంచి లోక్‌సభకు గెలిచారు.
ఐక్యరాజ్యసమితి సమావేశానికి భారత ప్రతినిధిగా వెళ్లారు. కెన్యా, స్విట్జర్లాండ్, బ్రిటన్, బల్గేరియా, పెరులాంటి దేశాల్లో పార్లమెంటరీ వ్యవహారాల పరిశీలన కోసం పర్యటించారు.
ప్రస్తుతం 2010 జూన్ నుంచీ మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో కేంద్ర గిరిజన సంక్షేమం, పంచాయితీరాజ్ శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.
‘ఛేంజింగ్ ఇండియాస్ పొలిటికల్ మౌల్డ్’ పుస్తకం రాశారు.
నో సినిమా... నో సెక్యూరిటీ...
సినిమాల విషయంలో కిశోర్ చంద్రదేవ్ వెరీ పూర్. కురుపాంలో ఆయన కుటుంబానికి ఒక థియేటర్ ఉండేది. దాన్లో చిన్నప్పుడెప్పుడో పాతాళభైరవి, మాయాబజార్ చూశారట. తర్వాత చూడనే లేదట. ‘సినిమాలకు సంబంధించిన జ్ఞానంలో నేను పూర్తిగా వెనుకబడినవాణ్ణి’ అంటారాయన. కురుపాంలోని ఆ టాకీస్‌ను కూడా అమ్మేశారు.
‘ఖాళీ దొరికితే పుస్తకాలు చదువుతాను. ఇంకొంచెం ఖాళీ దొరికితే సంగీతం వింటా’నంటారు కిశోర్. బాలమురళీ, ఘంటసాల, మహమ్మద్ రఫీ ఆయన అభిమానించే గాయకులు.
మాంసాహారాన్ని ఇష్టపడతారు. అలా అని అది తప్పనిసరిగా ఉండాలని కాదు, ఏదుంటే అది తింటానంటారు.
దేవుడంటే నమ్మకం ఉంది. పూజలు చేస్తారు.
ల్యాండ్ సీలింగ్ కింద కుటుంబానికి చెందిన మూడువేల ఎకరాల పొలాన్ని స్వచ్ఛందంగా సర్కారువారికి అప్పగించారు.
తన దగ్గరకు వచ్చినవారి సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారు. బాధలు చెప్పుకోవడానికి వచ్చేవారిలో చాలా మంది పేదవారే. అలాంటివారికి ఆయనే దారిఖర్చులిచ్చి మరీ ఊళ్లకి పంపిస్తారు.
కేంద్రమంత్రికి ఉండాల్సిన సెక్యూరిటీ బృందాలు చంద్రదేవ్ దగ్గర మచ్చుకైనా కనిపించవు. అడవుల్లో ప్రయాణించినా, సెక్యూరిటీ వద్దంటారు. ప్రజలే రక్షకులని నమ్ముతారు. ‘ఈ వేళా రేపూ సెక్యూరిటీ అనేది స్టేటస్ సింబల్ అయిపోయింది. పెద్దపెద్ద గన్‌లు, గన్‌మేన్ల హడావుడి నాకంతగా నచ్చదు. అవసరమనుకున్నప్పుడు నేనే పిలుస్తానని చెప్పి వారిని పంపేస్తాను. వాళ్లు నాకు బదులుగా మరొకరికి భద్రత కల్పించవచ్చు కదా’ అంటారు.
No comments:
Post a Comment